గద్వాల క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 41వ నేత్రదాన పక్షోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వైద్యాధికారి సంధ్యాకిరణ్మయి మాట్లాడుతూ ప్రతి దృశ్యాన్ని చూడాలంటే నేత్రాలు ఎంతో దోహదం పడుతాయన్నారు. మరణించిన తర్వాత కళ్లను మరొకరికి దానం చేయడం ద్వారా వారికి చూపును అందించిన వారమవుతామన్నారు. ప్రతిఒక్కరు తన మరణానంతరం నేత్రదానం చేస్తే చూపులేని వారికి జీవం అందించిన వ్యక్తులుగా చిరస్థాయిలో నిలిచిపోతారన్నారు. నేత్రదాన పక్షోత్సవాలను వచ్చే నెల 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కళ్ల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకువచ్చేందుకు ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రసూనారాణి, రాజు, అస్గర్‌అలీ, రామచంద్రరావు, ప్రవీణ్‌కుమార్, తిరుమల్‌రెడ్డి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


