● రూ.40.70 కోట్లు స్వాహా
● మిల్లు యాజమాని అరెస్టు
గద్వాల క్రైం: యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో కేసు నమోదు చేసి, నిందితుడిని బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. కేటీదొడ్డి మండలంలోని కమ్మిడిస్వామి రైస్‌మిల్లు నిర్వాహకుడు నందిన్నెకు చెందిన కుర్వ వీరన్నకు 2023, 2024, 2025 యాసంగి, వానాకాలం సీజన్లలో 17,754.240 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే నిర్వాహకుడు మూడేళ్ల గాను 2,689.316 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అందించాడు. ఇంకా 15,064.924 మె.ట. ధాన్యం అందించాల్సి ఉండగా.. 12,643.040 మెట్రిక్ టన్నుల (3,16,101 బ్యాగులు) వరి ధాన్యం అక్రమంగా విక్రయించి రూ.40,70,82,947 కోట్ల సొమ్ము కాజేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారన్నారు. హైకోర్టు ఈ నెల 17న ఇచ్చిన ఆదేశాల మేరకు టీజీఎస్‌సీఎస్‌సీఎల్ జిల్లా మేనేజర్ విమల ఫిర్యాదుతో 25న కేటీదొడ్డి ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారని డీఎస్పీ వెల్లడించారు.
కలెక్టర్ పర్యవేక్షణలో..
కుర్వ వీరన్న ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినట్లు సంబంధిత శాఖ అధికారులు 2025లోనే కేటీదొడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు సంబంధిత కలెక్టర్ పర్యవేక్షణలో విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువు ఇంకా ముగియకపోవడంతో నిందితుడిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో గడువు ముగిసి, నిబంధనలు ఉల్లంఘించాడని తేలడంతో హైకోర్టు, ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు నిందితుడిపై 316(2), 316(5), 318(3), 318 (4) బీఎన్‌ఎస్, 7 ఈసీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. సదరు నిందితుడిపై పలు హత్య కేసులు సైతం ఉన్నాయని తెలిపారు.
అధికారులను
విచారించిన వైనం..
2023, 2024, 2025 సంవత్సరాల్లో ధాన్యం కేటాయింపులపై పోలీసులు ఆ శాఖలోని ముగ్గురు కీలక ఉద్యోగులను సైతం విచారించారు. అధికారులు తీసుకున్న చర్యలు, తనిఖీలు, నివేదికలపై ఆరా తీశామని డీఎస్పీ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, విజెలెన్స్ అధికారుల నిఘా ఉన్నప్పటికీ మిల్లు నిర్వాహకుడు ప్రభుత్వాన్ని మోసం చేసిన తీరుపై ప్రశ్నలు సంధించినట్లు వివరించారు. విచారణలో అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని, కీలక ఉద్యోగులను మరోసారి విచారించి తగు చర్య లు తీసుకుంటామన్నారు. నిందితుడిని గురువారం గద్వాల కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలిస్తామన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.


