గద్వాల న్యూటౌన్: ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ముస్లింలు మిలాద్–ఉన్–నబీ వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని ఉర్ధూఘర్ షాదీఖానాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం రాత్రి మజీద్ లలో ఖురాన్ పఠనంతో జాగరణ చేశారు. పలువురు ముస్లింలు అన్నదానం చేశారు. మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, శాంతి, సోదరభావ మార్గా న్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ మహమ్మద్ ప్రవక్త మార్గంలో నడవాలని మత పెద్దలు మౌలానా సయ్యద్ సుల్తాన్ మోయిద్దీన్ పాషా ఖాద్రి, హజ్రత్ మౌలానా సయ్యద్ షా మాఖ్దుమ్, ఆలీ మూసూమ్ ఖాద్రి సూచించారు. ఇస్లాం అంటే శాంతి అని, ప్రవక్త శాంతిదూత అని పేర్కొన్నారు. ఆచారమేదై నా, మతమేదైనా మంచితనంతో మెలగాలని ప్రవక్త కాంక్షించారని చెప్పారు. అనంతరం మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో షాదీఖానా నుంచి నిర్వహించిన ర్యాలీని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్నాబాషా ప్రారంభించగా.. పట్టణంలోని రాజీవ్‌మార్గ్, వైఎస్సార్ సర్కిల్, గాంధీచౌక్, కూరగాయల మార్కెట్ రోడ్ల మీదుగా ఒంటలపేటలోని అన్వర్ మసీద్ వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం మతపెద్దలను, ముఖ్య అతిథులను మిలాద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో మిలాద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, సయ్యద్ ఫారుఖ్‌పాష ఖాద్రీ, రహమాన్ పాల్గొన్నారు.


