సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పులుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాలను విస్తరించాలనే లక్ష్యంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) కోర్ ప్రాంతంలోని చెంచు పెంటలు, గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ నిర్ణయం, పునరావాస ప్యాకేజీలతో తరలిపోయేందుకు గిరిజనేతర కుటుంబాల నుంచి సానుకూలత కనిపిస్తుండగా.. చెంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా నల్లమలలో పులుల సంరక్షణ, చెంచుల హక్కులు, జీవన విధానం మధ్య సమతుల్యత సాధన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
తొలి దశలో 4 గ్రామాలు..
నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలో రెండో అతిపెద్ద పులుల అభయారణ్యం. 2,611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఆదివాసీ చెంచులు బొడ్డు గుడిసెల్లో ఉంటూ అటవీ ఉత్పత్తుల సేకరణ, చిన్నపాటి వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజనేతరులు (బీసీ, ఎస్టీ, ఓసీ) స్థిరపడ్డారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) అనుమతితో తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లంపెంటకు చెందిన కుటుంబాలను తరలిస్తున్నారు. రెండో దశలో వట్వర్లపల్లిని తరలించనున్నారు.
వెళ్లేది లేదు.. వెళ్లడమే సరైన మార్గం..
గ్రామసభల అంగీకారం లేకుండానే రీలొకేషన్ ప్రక్రియ ముందుకు సాగుతోందని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులే తమ జీవనోపాధి అని, జంతువులను దేవుళ్లుగా భావించే తమకు వాటితో ఎలాంటి ఘర్షణ లేదని, అడవిని విడిచి వెళ్లడమంటే తమ ఉనికిని కోల్పోవడమేనని, ఏజెన్సీ హక్కులకు దూరమవుతామని వాపోతున్నారు. బలవంతంగా తరలిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. మరో వైపు అడవిలో భూములకు హక్కు పత్రాలు లేక రుణాలు పొందలేకపోతున్నామని, పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లడమే సరైన మార్గమని గిరిజనేతరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంగీకారం తెలపని 166 కుటుంబాలు..
నల్లమల కోర్ ఏరియా నుంచి తరలిపోయే వారికి పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఎన్‌హెచ్–167కే పక్కన పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయం, గృహాలు, రోడ్లకు మొత్తం రూ.187.95 కోట్లు కానుండగా.. మొదటి విడతలో 417 కుటుంబాలకు రెండు ఆప్షన్లు కలిపి రూ.62.55 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 257 ఇళ్లకు ప్లాట్లు చేసి రాళ్లు పాతారు. ఈ నెల 18న డిప్ ద్వారా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 256 మందికి ఇంటి స్థలాల పట్టాలు అందజేశారు. తొలిదశలో ఇంకా 166 కుటుంబాలు తరలిపోవడానికి అంగీకారం తెలపలేదు. ఇందులో 85 వరకు చెంచు, మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు ఉన్నట్లు సమాచారం.
నల్లమలలో అడవిబిడ్డల ‘అరణ్య’ రోదన
మైదాన ప్రాంతాలకు తరలింపుపై మిశ్రమ స్పందన
ఉనికినే కోల్పోతామని ససేమిరా అంటున్న చెంచులు
అడవితల్లి నుంచి విడదీస్తే బతకలేమని ఆవేదన


