● అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు
● నిత్యం భారీ యంత్రాలతో తవ్వకాలు
● చోద్యం చూస్తున్న రెవెన్యూ,
మైనింగ్‌శాఖ అధికారులు
● ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే
స్పందిస్తున్న పోలీసులు
● ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
గద్వాల క్రైం: నడిగడ్డలో ప్రకృతి వనరులను మట్టి మేతగాళ్లు కొల్లగొడుతున్నారు. ‘ఎక్కడైనా తవ్వుకోండి.. ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకోండి.. ఎవ రూ అడ్డుకోరు.. ఎవరైనా ఆపితే అండగా ఉంటాం.’’ అని అధికార పార్టీ ముఖ్య నేతలు అభయం ఇ స్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గు ట్టలు, చెరువుల్లో నిరాటంకంగా భారీ యంత్రాలతో మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు చోద్యం చూస్తుండగా.. ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే పోలీసులు స్పందించి కేసులు నమోదు చేస్తున్నారు.
మాటలకే పరిమితం..
మట్టి అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు తమకేందుకు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని నెలలుగా స్థబుగా ఉన్న మట్టి మాఫియా.. 20 రోజుల నుంచి మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తోంది. ఒక ట్రాక్టర్ మట్టికి రూ.1,600, టిప్పర్‌కు రూ.6వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఎటు చూసినా నూతన నిర్మాణాలు చేపడుతుండటంతో మట్టి వ్యాపారులు సిండికేట్‌గా మారి తమకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం వరకే అధికారులు పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో..
మట్టి వ్యాపారులు గతంలో ఒకరిపై మరొకరు అధికారులకు సమాచారం అందించి కేసులు నమోదు చేయించే వారు. అయితే ప్రస్తుతం రూట్ మార్చారు. ఉప్పు, నీరుగా ఉండే వ్యాపారులు ఒక్కటయ్యారు. తవ్వుకో.. దోచుకో.. తినుకో అనే సూత్రంతో అధికార పార్టీ నాయకులు వ్యవహారం నడిపిస్తున్నారు. అనుమతులు ఉన్నా.. లేకున్నా అన్నీ తామై చూసుకుంటామని చెబుతూ.. శత్రు శేషం లేకుండా చక్రం తిప్పడంతో పాటు తాము ప్రకటించిన ధరలకే మట్టి విక్రయాలు జరిగేలా చూస్తున్నారు. అయితే రెవెన్యూ, మైనింగ్, పోలీసుశాఖల అధికారులు నాయకుల కనుసన్నుల్లో ఉండటంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా మైనింగ్‌శాఖ ఏడీని ‘సాక్షి’ వివరణ కోరేందుకు సంప్రదించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.


