నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

గద్వాల క్రైం: నేరస్తుల విషయంలో పోలీస్‌ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని జిల్లాలోని శాంతిభద్రతల విషయాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని ప్రార్థన మందిరాల వద్ద పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేసి, అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టాలన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి స్వీయ జాగ్రత్తలపై సూచనలు చేయాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచి ప్రతి గూడ్స్‌ వాహనాలు, కంటెనర్లను తనిఖీ చేయాలని, పశువులను అక్రమంగా తరలించిన వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సమస్యలపై వచ్చే పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీట్‌ దాఖాలు చేసి, నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్‌లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్‌, శ్రీకాంత్‌, శ్రీహరి, నాగశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement