ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం కాబోతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వంతెన నిర్మాణంతో గద్వాల, ఆత్మకూర్ ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది. జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిలో భారీ పిల్లర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదివరకే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 1న శంకుస్థాపన చేయగా.. వెంటనే తాత్కాలిక రహదారి నిర్మాణ చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు.
వివాదాలు.. అడ్డంకులు...
హైలెవల్ వంతెన పనులను ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు భద్రతలో భాగంగా వంతెన నిర్మాణం డ్యాం వద్ద చేపట్టాలని ఎంపీ డీకే అరుణ పట్టుబట్టారు. ఇరిగేషన్‌శాఖ సమీక్షలో సైతం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డ్యాం వద్దనే వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించడంతో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఎంపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇరిగేషన్ నిధులతో డ్యాం సేఫ్టీ వంతెన నిర్మించాలని, ఆర్‌అండ్‌బీ నిధులతో కొత్తపల్లి–జూరాల వంతెన నిర్మించాలని, అభివృద్ధిని అడ్డుకోవడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
18 నెలల్లో పూర్తి...
జూరాల, కొత్తపల్లి మధ్యన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించింది. దీంతో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. ముఖ్యమంత్రి పనులను లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరితగతిన పూర్తిచేసే విధంగా కాంట్రాక్టు కంపెనీ, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతున్నారు. మొత్తం 18 పిల్లర్లతో ఏడాదిన్నరలోగా పనులు పూర్తిచేసే విధంగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొంటున్నారు.
రూ.123 కోట్లతో వంతెన నిర్మాణం
జూరాల– కొత్తపల్లి మధ్య కృష్ణానదిలో కొనసాగుతున్న పిల్లర్ల పనులు
తాత్కాలిక రహదారిపై వాహనాల రాకపోకలు
గద్వాల, ఆత్మకూర్ మధ్య
తగ్గనున్న దూరం


