గద్వాల క్రైం: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం గద్వాల మండలం జమ్మిచెడ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్న ధాన్యాన్ని త్వరగా తూకం వేసి.. కేటాయించిన మిల్లులకు తరలించాలని సూచించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను పరిశీలించారు. అనంతరం కొండాపల్లి శివారులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ మొగిలయ్య, ఎస్‌ఐ శ్రీకాంత్ ఉన్నారు.


