గద్వాల: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్రమార్కులకు అక్షయపాత్రగా మారింది. అధికారులకు ముడుపులిస్తే చాలు.. నిబంధనలకు పాతరేసి ధాన్యం కేటాయింపులు చేసేస్తున్నారు. దీనిపై పలుమార్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం యాసంగి వరిధాన్యం సేకరణ ప్రక్రియ, మిల్లులకు ధాన్యం కేటాయింపులపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే మిల్లులకు ధాన్యం కేటాయింపుల్లో వ్యత్యాసాన్ని గమనించారు. ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇష్టానుసారంగా ధాన్యాన్ని మిల్లులకు ఎలా కేటాయిస్తారని నిలదీయడంతో పాటు ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్‌కు సమాధానమిచ్చేందుకు తడబడుతూ.. నీళ్లు నమలడం అధిఽకారుల వంతైంది. జిల్లాలో ధాన్యం కేటాయింపుల వ్యవహారంపై కలెక్టర్ అంతర్గత విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ధాన్యం కేటాయింపులో చోటు చేసుకున్న అవినీతిలో తమ పాత్ర బయటపడుతుందనే గుబులు అధికారుల్లో మొదలైంది.
రూ.కోట్ల ధాన్యాన్ని కొట్టేశారు..
మూడేళ్ల క్రితం శాంతినగర్, గద్వాల అయిజ మండలాల పరిధిలోని మిల్లర్లు ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యంలో సుమారు రూ. 50కోట్ల ధాన్యాన్ని విక్రయించుకుని ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఈ అవినీతి వ్యవహారాన్ని ‘సాక్షి’ ఽఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన అధికారులు.. సదరు అవినీతిపరులైన మిల్లర్లపై కేసులు నమోదుచేసి.. ఆర్‌ఆర్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేశారు.
● గతేడాది కేటీదొడ్డి మండలంలో కమ్మిడిస్వామి రైస్‌మిల్లుకు సామర్థ్యానికి మించి రూ. కోట్ల విలువైన ధాన్యం కేటాయించారు. అయితే ధాన్యాన్ని అక్రమంగా రాత్రివేళలో విక్రయించేందుకు ప్రయత్నించగా నందిన్నె గ్రామస్తులు పట్టుకున్నారు. దీనిపై రగిలిన సదరు మిల్లు యజమాని, ఆయన కుమారుడు ఏకంగా ఓ వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించడం సంచలనం రేపింది.
సమగ్ర విచారణ..
మిల్లులకు ధాన్యం కేటాయింపులో చోటు చేసుకున్న వ్యత్యాసాలపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమగ్ర విచారణ చేపట్టారు. రెండేళ్లలో మిల్లులకు కేటాయించిన ధాన్యం వివరాలతో పాటు రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి అందించిన సీఎంఆర్ వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. కొన్ని మిల్లులకు అధిక కేటాయింపులు ఉండటం.. పొరుగు జిల్లాల నుంచి సైతం కేటాయింపులు ఉండటంపై విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాలో మిల్లులకు ధాన్యం కేటాయింపులు అసమగ్రంగా ఉండటంతో వివరాల కోసం అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం ధాన్యం సేకరణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐకేపీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయడం.. షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ధాన్యం కేటాయింపుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


