సజావుగా ధ్యానం సేకరణ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

సజావుగా ధ్యానం సేకరణ ప్రక్రియ

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

యంగ్‌ ఇండియా పాఠశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

కేటీదొడ్డి: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులకు సూచించారు. కేటీదొడ్డి మండల కేంద్రంతో పాటు కొండాపురం, గువ్వలదిన్నె గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించడంతో పాటు ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు తేమశాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం చేసి, మిల్లులకు తరలించాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా రైతులకు సకాలంలో చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓపీఎంఎస్‌ కాకుంటే రైతులకు సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడతారన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ట్రక్‌ షీట్‌ వివరాల్లో తప్పిదాలు ఉంటే సరిచేసి పంపాలని సూచించారు. అనంతరం నందిన్నె అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును కలెక్టర్‌ తనిఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ విధానం, రిజిస్టర్‌ నిర్వహణ, వాహన పత్రాల పరిశీలన తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి మొక్కజొన్న, వరిధాన్యం రాకుండా చూడాలన్నారు.

● కేటీదొడ్డిలో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. భూమి చదును పూర్తయినందున అకాడమీ బ్లాక్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఒప్పందం ప్రకారం ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కలెక్టర్‌ వెంట పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ విమల, అడిషనల్‌ డీఆర్డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కరుణాకర్‌, ఏఓ రాజవర్దన్‌రెడ్డి, ఎంపీడీఓ రమణారావు, విద్యాశాఖ ఇంజినీర్‌ మోహన్‌రెడ్డి, ఏపీఎం చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement