మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి అన్నారు. గురువారం ఇటిక్యాల పీహెచ్‌సీలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. పీహెచ్‌సీలో కేవలం ఒక కాన్పు మాత్రమే చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓపీ, ప్రసవాల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్ధితులను మినహాయించి సాధారణ కాన్పులు చేయాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం నిర్వహించాలని.. జాతీయ ఆరోగ్య పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చూడాలన్నారు. డీఎంహెచ్‌ఓ వెంట జిల్లా ఎన్‌సీడీ కోఆర్డినేటర్‌ శ్యామ్‌సుందర్‌ ఉన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలోని పలు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 1, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి గల ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కులం, ఆదాయం, బోనఫైడ్‌ సర్టిఫికెట్లతో జూన్‌ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 10వ తేదీన లాటరీ విధానంలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.

గురుకుల విద్యార్థికిప్రతిభా పురస్కారం

వనపర్తి రూరల్‌: చిట్యాల, కడుకుంట్ల ఎంజేపీ బీసీ గురుకుల జూనియర్‌ కళాశాల ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థి విలాస్‌ వార్షిక పరీక్షల్లో 991 మార్కులు సాధించారు. గురువారం హైదరాబాద్‌లోని సేవాలాల్‌ బంజారా భవన్‌లో తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంజేపీ సొసైటీ నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో విలాస్‌కు రాష్ట్ర ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు ప్రతిభా పురస్కారం, రూ.10 వేలు, జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌సీఓ శ్రీనివాస్‌గౌడ్‌, డీసీఓ శ్రీవేణి, ప్రిన్స్‌పాల్‌ గురువయ్యగౌడ్‌, కళాశాల అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement