మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పూర్వవిద్యార్థులు యూనివర్సిటీలో భాగస్వాములుకావాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పీయూలో విద్యావారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీయూలో చదివి వివిధ స్థాయిల్లో విద్యార్థులు పనిచేయడం గొప్ప విషయమని, జీవితంలో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీతో అనుబంధం కొనసాగించాలని సూచించారు. పూర్వ విద్యార్థుల అనుభవాలు, విజయాలు ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మార్గదర్శనం కావాలన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు చదువు ఒక్కటే కాదని, దానితో పాటు స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలకు అవసరమైన విధంగా విద్యార్థులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కుమారస్వామి, అనురాధారెడ్డి, మాళవి, కరుణాకర్‌రెడ్డి, నూర్జహాన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


