అమరచింత: ఆధునిక యుగంలోనూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం అందించడానికి వందేమాతరం ఫౌండేషన్ కృషి చేస్తోందని ఆ సంస్థ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మాధవరావు అన్నారు. పట్టణంలోని డీఎంఆర్‌ఎం ప్రభుత్వ పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు సమాజంపై ప్రేమ ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే ఉద్దేశాలను వారిలో చిన్నతనం నుంచి అలవాటు చేయాలన్నారు. కేవలం పుస్తక పఠనంతోనే విద్యార్థి ఎదుగుతాడనే ఆలోచనను వీడి చదువుతో పాటు ఎదుటి వారిని గౌరవించే గుణం నేర్పించాలని సూచించారు. విద్యార్థులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించినపుడే ఎదుటి వారి పట్ల మర్యాదగా నడుచుకుంటారన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో 12 వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని.. 2,500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. అమరచింతలోని శిక్షణ శిబిరానికి వచ్చే విద్యార్థులకు ఉచితంగా భోజనం అందించేందుకు డీఎంఆర్‌ఎం ట్రస్ట్ చైర్మన్ దేశాయి ప్రకాష్‌రెడ్డి ముందుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆచార్య రమేష్ గురుజీ, కో–ఆర్డినేటర్ బాలకృష్ణ పాల్గొన్నారు.


