ఘటనపై ఆధారాలివ్వండి
సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్ష్యులందరినీ విచారిస్తున్నామని చెప్పారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నామని, అయితే కేసు పురోగతి కోసం బాధిత కుటుంబ సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతరలో గణేశ్, చంద్రకళపై దాడి చేసినట్లు మాత్రమే బాధితులు మొదట ఫిర్యాదు చేశారని ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. మొదట ఫిర్యాదులో మౌనిక, ఆమె బిడ్డపై దాడి ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. మౌనికతోపాటు బిడ్డపై దాడికి సంబంధించిన ఏ చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసుగా మార్చి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే తమకు సమర్పించి కేసు పురోగతికి సహకరించాలని కోరారు.
‘ఈ నెల 18న కుమ్మెర జాతరలో తమపై దాడి జరిగిందని రాత్రి 8.30 గంటల సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తలపై రక్తస్రావం, గాయాలు ఉండటం, కాగ్నిజబుల్ ఆరోపణలు ఉండటంతో కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. అదేరోజు రాత్రి 9.30 గంటలకు గణేశ్ తమపై దాడి జరిగిందని 8 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో గణేశ్‌తోపాటు చంద్రకళపై మాత్రమే దాడి చేశారని పేర్కొన్నారు. మౌనిక, ఆమె పాప ప్రస్తావన ఫిర్యాదులో లేదు. ఆరోపణలు నాన్ కాగ్నిజబుల్ కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేశాం. మెడికల్ రిపోర్టులో సాధారణ దెబ్బలు ఉన్నాయి. ఘటనరోజు ఇచ్చిన ఫిర్యాదులో కులం పేరుతో తిట్టారన్న ప్రస్తావన కూడా లేదు.
కుమ్మెర జాతరలో మౌనిక, పాపపై
దాడికి సంబంధించి సాక్ష్యాలు లేవు
దాడి ఘటనకు ముందే పాప ఆరోగ్యం క్షీణించడంతో నీలోఫర్‌లో చికిత్స
మొదటి ఫిర్యాదులో గణేశ్, చంద్రకళపై దాడి మాత్రమే ప్రస్తావన
చిన్న సాక్ష్యం దొరికినా
హత్యకేసు నమోదు చేస్తాం
విలేకరుల సమావేశంలో
ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్
కుమ్మెర జాతరలో మౌనిక, ఆమె పాపపై దాడి జరిగిందన్న దానికి విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఏ చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసుగా మార్చి చర్యలు తీసుకుంటాం. ఈ నెల 18న ఘటన జరిగితే 21న పాప మరణించే వరకు ఎక్కడా మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టుగా లేదు. బాధితురాలికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పరిహారాన్ని త్వరగా అందించేందుకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాలు, ఆధారాలు ఇవ్వమని అడిగినా కుటుంబం సహకరించలేదు. ఆధార్, రేషన్ లాంటి కనీస ఆధారం కూడా ఇవ్వలేదు. డిసెంబర్ 21న పాప తక్కువ బరువు 1.44 కేజీలుగా జన్మించింది. ఘటనకు ముందే పాప శ్వాస సంబంధ, న్యూమోనియా, జాండీస్ వంటి సమస్యలతో నీలోఫర్‌లో 30 రోజులపాటు చికిత్స పొందింది. పోస్టుమార్టం రిపోర్టులో అంతర్గత, బహిర్గత గాయాలు ఏమీ లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. హిస్టోపాథాలజీ, విస్త్రా రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి.


