హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం
నిందితులను అరెస్టు చేయకపోతే..
● రాష్ట్ర ఉద్యమంగా కుమ్మెర ఘటనను
ముందుకు తీసుకెళ్తాం
● మాజీ మంత్రి, ఎమ్మెల్యే
తలసాని శ్రీనివాస్‌యాదవ్
నాగర్‌కర్నూల్ క్రైం: రెండు నెలల పసిపాపను చంపిన ఘటనలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని దిగ్బందిస్తామని.. ముఖ్యమంత్రి ఇంటితో పాటు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ కుల, మతపరమైన ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కుల అహంకారంతో ఈ దాడి జరిగిందని.. ఇందుకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారి మృతి ఘటనపై పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామన్నారు. బడుగు బలహీన వర్గాలు ఐక్యమత్యతో ఉంటూ ఇలాంటి ఘటనలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మీడియాకు ఒక బులిటెన్ జారీ చేసి, అందులో బాధితులనే నిందితులుగా చూపడం.. చిన్నారి మృతదేహంపై, అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని ప్రకటించడం.. ఘటన జరిగిన సమయంలో కుమ్మెర గ్రామంలో ఆ చిన్నారి లేదని చెప్పడాన్ని చూస్తే కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీసులు, పాలకులు కుట్రలు పన్నుతున్నారని స్పష్టమవుతుందని అన్నారు. పోలీసు వ్యవస్థ న్యాయం వైపు ఉండాలని హితవు పలికారు. బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


