మూడంచెల్లో బందోబస్తు
గద్వాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా పోలీస్ శాఖ తరపున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
నాలుగు మున్సిపాలిటీల పరిధిలో..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి 77 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. ప్రధానంగా బందోబస్తును మూడు భాగాలు విభజించి చేపడుతున్నాం. మొదటిది ప్రీపోల్ బందోబస్తులో నామినేషన్ల ప్రక్రియ, ర్యాలీలు, విత్‌డ్రాలు వంటివి ఉంటాయి. వీటికి అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించాం. ఇక రెండోది పోల్ బందోబస్తు కాగా.. ఈ నెల 11న జరిగే పోలింగ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాం. ప్రధానంగా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ఇప్పటికే బందోబస్తుపై దృష్టిపెట్టాం. అదేవిధంగా సమస్యాత్మాక ప్రాంతాలను గుర్తించి అదనపు బందోబస్తు కల్పించనున్నాం. రూట్ బందోబస్తు కోసం జిల్లావ్యాప్తంగా నాలుగు చోట్ల సరిహద్దు ప్రాంతాల్లో బందోబస్తు కల్పిస్తాం. ఇందులో మూడు ఇంటర్ స్టేట్, ఒకటి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. గట్టు మండలం బలిగెర, రాజోలి మండలం సుంకేసుల, అలంపూర్ మండలం ర్యాలంపాడు వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, ధరూర్ మండలం జూరాల డ్యాం వద్ద అంతర్ జిల్లా చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. మూడో విభాగంలో కౌంటింగ్ బందోబస్తు కోసం నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నాలుగు కౌంటింగ్ సెంటర్లలోని స్ట్రాంగ్ రూం వద్ద ప్రత్యేక ఫోర్స్‌తో బందోబస్తు కల్పిస్తున్నాం. కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే సన్నద్ధం చేశాం. ఇందులో కౌంటింగ్ సెంటర్ లోపల, కౌంటింగ్ సెంటర్ వెలుపల బందోబస్తు ఆర్మ్‌డు ఫోర్స్‌తో ఉంటుంది.
ర్యాలీలు నిషేధం..
ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వచ్చిన వెంటనే ఏ పార్టీలు, నాయకులు ర్యాలీలు, విజయోత్సవాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. చైర్మన్ ఎన్నిక వరకు మోడల్ కోడ్ కండక్ట్ అమలులో ఉంటుందనే విషయాన్ని ప్రతిఒక్కరు గమనించాలి. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు చేపడుతాం.
ముందస్తు అనుమతి తప్పనిసరి..
ఎన్నికల సందర్భంగా ఎవరైన పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు లౌడ్‌స్పీకర్లు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించుకోవాలనుకుంటే ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి. ఆన్‌లైన్‌లో ఎవరైతే ముందుగా దరఖాస్తు చేసుకుంటారో వారికి క్రమపద్ధతిలో అనుమతులు ఇస్తాం.
విస్తృతంగా తనిఖీలు..
ఎన్నికలు పకడ్బందీగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా 10 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. ఇందులో 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 6 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు ఏర్పాటు చేశాం. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, అయిజలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, వడ్డేపల్లిలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, అలంపూర్‌లో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు ఏర్పాటు చేశాం. ఈటీంలు నిబంధనల మేరకు విస్తృత తనిఖీలు చేపడుతాయి. ఏదేని అనుమానాస్పద వస్తువులు, అక్రమ నగదు తరలింపు చేపడితే చర్యలు తీసుకుంటాం.
24 గంటలపాటు పెట్రోలింగ్..
జిల్లావ్యాప్తంగా ఎన్నికలు జరిగే నాలుగు మున్సిపాలిటీలో 24 గంటల పాటు పెట్రోలింగ్ ఉంటుంది. గద్వాల మున్సిపాలిటీలో ఎస్‌ఐ స్థాయి అధికారితో రెండు టీంలు, అలంపూర్, అయిజ, వడ్డేపల్లిలో ఒక టీం చొప్పున ఏర్పాటు చేసి పగలు, రాత్రివేళలో పెట్రోలింగ్‌తో కూడిన బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకళాపాలు గమనిస్తే ప్రజలు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు..
ఓటుహక్కు వినియోగం ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరి బాధ్యత. ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకుని మెరుగైన వ్యక్తులను ఎన్నుకుని సమ సమాజ హితంలో భాగస్వాములు కావాలి. ఇందుకోసం పోలీసుశాఖ పరంగా అవసరమైన అన్ని పటిష్ట చర్యలు తీసుకుని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా సహకరిస్తాం.
140 మంది
బైండోవర్..
ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జిల్లావ్యాప్తంగా 140 మంది రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారు, ఘర్షణలు సృష్టించే వారిని గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేశాం. అలాగే వాహనాల తనిఖీలు, పెట్రోలింగ్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న లిక్కరు పట్టుకున్నాం. ఇప్పటి వరకు 150 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశాం.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు
పోలింగ్ విధుల్లో 500 మంది సివిల్, ఆర్ముడ్ పోలీసులు
జిల్లావ్యాప్తంగా 4 చెక్‌పోస్టులు ఏర్పాటు
150 లీటర్ల లిక్కర్ స్వాధీనం.. లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్పీ శ్రీనివాసరావు
ఆయుధాలు డిపాజిట్..
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లావ్యాప్తంగా లైసెన్స్ ఆయుధాలు కలిగిన వ్యక్తుల నుంచి ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నాం. ఎన్నికల నియమావళి తొలగిన అనంతరం ఎవరి ఆయుధాలను వారికి తిరిగి అప్పగిస్తాం.
మూడంచెల్లో బందోబస్తు


