ఆశాజనకంగా యాసంగి | - | Sakshi
Sakshi News home page

ఆశాజనకంగా యాసంగి

Feb 7 2026 10:10 AM | Updated on Feb 7 2026 10:10 AM

ఆశాజన

ఆశాజనకంగా యాసంగి

చివరలో కురిసిన భారీ వర్షాలతో పుష్కలంగా నీళ్లు

విస్తారంగా పప్పుశనగ, వేరుశనగ, వరి, మొక్కజొన్న పంటల సాగు

ఖరీఫ్‌ నష్టాల నుంచి గట్టెక్కిస్తుందని ఆశలు

గద్వాల వ్యవసాయం: ప్రస్తుత యాసంగి సీజన్‌ సాఫీగా సాగుతోంది. వానాకాలం సీజన్‌లో అధిక వర్షాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టాల పాలయ్యారు. జరిగిన నష్టాన్ని దిగమింగుకొని యాసంగి సీజన్‌ అయినా గట్టెక్కిస్తుందన్న గంపెడు ఆశతో యాసంగిని ఆరభించిన రైతులకు ప్రస్తుత పంటల పరిస్థితి ఊరటనిస్తోంది.

కన్నీరు మిగిల్చిన ఖరీఫ్‌..

గడిచిన ఏడాది 2024–25 వానాకాలం (ఖరీఫ్‌), యాసంగి సీజన్‌లు రైతులకు కలిసొచ్చాయి. వానాకాలంలో సమయానుకూలంగా వర్షాలు కురిశాయి. బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలం కావడంతో ఆ ఏడాది వానాకాలం సీజన్‌, యాసంగి సీజన్‌ సాగు సాఫీగా సాగింది. పత్తి, కంది, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల దిగుబడులు బాగానే వచ్చాయి. అయితే 2025 వానాకాలం సీజన్‌ (ఖరీఫ్‌) రైతులకు కన్నీరు తెప్పించింది. ఆరంభంలో వర్షాలు కురవలేదు. ఆ తర్వాత ప్రధానంగా జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంటలపై పడింది. పలుచోట్ల నీరు నిల్వ అయి మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లోనూ కురిసిన వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్లు, వైరస్‌లు, రకరకాల పురుగులు ఆశించాయి. ఫలితంగా జిల్లాలో అత్యధికంగా సాగు చేసిన పత్తి పంట దిగుబడులు సగానికి పడిపోయాయి. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా వానాకాలం సీజన్‌లో సాగు చేసిన అన్ని పంటల దిగుబడులు తగ్గి.. రైతులను ఆర్థికంగా నష్టాల పాలు చేసింది.

1,15,400 ఎకరాల్లో పంటలు..

ప్రస్తుత యాసంగిలో భాగంగా జిల్లాలో వరి, పప్పుశనగ, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ప్రధానంగా వేశారు. 1,30,516 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే 1,15,400 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. వానాకాలంలో కురిసిన విస్తారమైన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. దీంతో వీటి కింద రైతులు ఎక్కువగా పంటలు వేశారు. ఇక ఆయకట్టు కింద వరి సాగు చేశారు. మొక్కజొన్న గడిచిన ఏడాదితో పోల్చితే ఈసారి సాగు బాగా పెరిగింది. జొన్న పంట సాగు సైతం పెరిగింది. భూగర్భజలాల నీటిమట్టం పెరగడం వల్ల బోర్లు, బావులు బాగా రీచార్జి అయ్యాయి. దీనివల్ల నీటికి ఇబ్బందులు లేవు. ఇదే సమయంలో వాతావరణం సైతం అనుకూలంగా ఉంది. ఫలితంగా వరి, మొక్కజొ న్న, పప్పుశనగ, వేరుశనగ ఇలా అన్ని పంటల పరిస్థితి ఆశాజనకంగా ఉందని అటు రైతులు, ఇటు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెలంతా ఇలానే గడిస్తే పంట దిగుబడులు బాగా వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఇక కూరగాయల తోటలు సైతం మెరుగ్గా ఉన్నాయి. గడిచిన వానాకాలం సీజన్‌లో ఈ రైతులు కూడా నష్టాలు చూశారు. యాసంగి సీజన్‌లో మాత్రం కూరగాయల దిగుబడులు బాగా వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు.

పంట సాగు విస్తీర్ణం

(ఎకరాల్లో)

వరి 46,529

మొక్కజొన్న 40,380

జొన్న 7,559

పొగాకు 5,085

వేరుశనగ 5,447

పప్పుశనగ 5,259

అలసంద 2,588

మినుములు 2,323

ఇతర పంటలు 15,346

అన్ని పంటలు బాగున్నాయి.

అధిక వర్షాల వల్ల వానాకాలం సీజన్‌లో అన్ని పంటల దిగుబడులు తగ్గాయి. యాసంగి సీజన్‌లో వేసిన అన్ని పంటలు ప్రస్తుతం బాగున్నాయి. అన్ని రకాల పంటల దిగుబడులు ఆశాజనకంగా వస్తాయని భావిస్తున్నాం. – వీరప్ప, డీఏఓ

ఆశాజనకంగా యాసంగి 1
1/2

ఆశాజనకంగా యాసంగి

ఆశాజనకంగా యాసంగి 2
2/2

ఆశాజనకంగా యాసంగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement