మిగిలింది 2 రోజులే..
● మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు
● ప్రధాన పార్టీల మధ్య ప్రచార జోరు
● సమయం దగ్గరపడుతున్న కొద్దీ
అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్
● బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.
బలప్రదర్శనపై ఫోకస్..
ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
వలస ఓట్ల కోసం గాలింపు..
ఉమ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్‌చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
మొదలైన ప్రలోభాల పర్వం..
మున్సిపల్ పోలింగ్‌కు మూడు రోజుల ముందే పట్టణాల్లో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది.


