లోపల పొత్తులు.. బయటకు కత్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వైరుధ్యాలకు సంబంధం లేకుండా చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అంతర్గతంగా ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. బాహాటంగా పొత్తు మాట లేకుండా వార్డుల్లోనే మీకిది.. మాకది అన్న చందంగా పార్టీల అభ్యర్థులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య అంతర్గత పొత్తులు, సర్దుబాట్లు ముమ్మరంగా చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ గుట్టుగా సంప్రదింపులు జరుపుతుండటం చైర్మన్ పీఠాల కోసం పార్టీల పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది.
సర్దుబాట్లతో కలసిన పార్టీలు..
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌తో సంప్రదింపులు జరిపింది. అయితే చివరి నిమిషంలో ఏ పార్టీతోనూ పొత్తు పొసగలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు సొంతంగానే అభ్యర్థులను పోటీలో నిలిపాయి. చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అంతర్గత సర్దుబాట్లు కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉన్నచోట సహకరించడం, ఫలితంగా చైర్మన్ ఎన్నికల్లో మద్దతును పొందేలా ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా అంతర్గత సర్దుబాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఒప్పందంలో భాగంగా సీపీఎం పార్టీకి రెండు వార్డులను సైతం కేటాయించింది. అమరచింత మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ పది వార్డుల్లో సీపీఎం పార్టీకి మూడు వార్డులు దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో సీపీఎం పార్టీ ఒకచోట బీఆర్‌ఎస్, మరోచోట కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం గమనార్హం.
చక్రం తిప్పేందుకు బహుముఖ వ్యూహం..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో ఈసారి మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం వేగంగా సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇతర పార్టీల్లోని అభ్యర్థులతో సైతం టచ్‌లోకి వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ పలువార్డుల్లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సరు ్దబాట్లు కొనసాగుతుండటం, చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
గద్వాలలో చైర్మన్ కోసం పోటీతీవ్రం..
గద్వాల మున్సిపాలిటీలో ఈసారి చైర్మన్ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్ సైతం అంతర్గత పోరుతో ఇరువర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోని ఓ వర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థులతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య చైర్మన్ పీఠం కోసం తీవ్రమైన పోరు కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌లోనూ ఆపార్టీ కీలకనేత ఈ ఎన్నికల సందర్భంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశం ఆసక్తి రేపుతోంది.
వనపర్తి, అమరచింతలో బహిరంగంగానే పొత్తు..
మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు
చైర్మన్ పదవులే లక్ష్యంగా అంతర్గత ఒప్పందాలు
ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు
పార్టీలతో నిమిత్తం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాట్లు
లోపల పొత్తులు.. బయటకు కత్తులు


