ఒత్తిడితో ఆరోగ్యం చిత్తు
జిల్లాలో పెరుగుతున్న పక్షవాతం కేసులు
● వ్యాధి లక్షణాలతో 858 మంది సతమతం
● 15 శాతం మంది యువకులే కావడం ఆందోళనకరం
● లక్షణాలు ముందస్తుగా గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సర్వే
గద్వాల క్రైం: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడంలో నిర్లక్ష్యం.. వెరసి యువకులు సైతం పక్షవాతం బారిన పడుతున్నారు. దీనికితోడు వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం, సరైన సమయంలో తగిన వైద్యం తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఏరికోరి తెచ్చుకుంటున్నారు. జిల్లాలో 858 మంది ఈ వ్యాధి భారినపడ్డారు. అయితే ఇందులో 15 శాతం యువత సైతం ఈ లక్షణాలతో సతమతమవుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు 40 ఏళ్లలోపు వారు గత కొన్ని నెలల కిత్రం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు దిక్కులేని వారవుతున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వసతులు అందిస్తున్నారు. చాలామటుకు కేసుల్లో ఒత్తిడితో కూడిన జీవనం, మద్యపానం, దూమపానం, నిద్రలేమి సమస్యలతో మొదడు మొద్దుబారిపోతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రస్తుత సమయంలో చాలా మందికి ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి శరీరం బిగుసుపోవడం, మూతి వంకర తిరగడం, కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పని చేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయంపై ప్రభావం చూపుతున్న వ్యాధి పక్షవాతం అని వైద్యులు సూచిస్తున్నారు. పక్షవాతం.. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలను ఆకస్మాత్తుగా కుప్ప కూల్చేస్తోంది. వారి బతుకులను ఉన్నట్లుండి అంధకారంలో నెట్టేస్తోంది. పక్షవాతానికి గురైన కొందరు దివ్యాంగులుగా మిగిలిపోయి.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. పక్షవాతాన్ని (పెరాలసిస్), వైద్య పరిభాషలో బెయిన్ స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడుకు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారి మెదడుకు రక్త సరఫరా తగ్గడంతో శరీరంలో తిమ్మిర్లు, ఒక కాలు, చేతిలో శక్తి తక్కువైనట్లు అనిపిస్తుంది. పూర్తిగా లేదా సరిగ్గా మాట్లాడలేరు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేరు. చూపు మసకబారుతుంది. తీవ్ర తలనొప్పి, ముందుకు నడవలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు కనిపించిన మూడు గంటలోపు ఆసుపత్రికి తీసుకేళ్తే.. వైద్యులు మెరుగైన వైద్యం అందించి రక్త ప్రసరణను పునరుద్ధరిస్తారు. మొదడు ఎక్కువగా దెబ్బ తినకుండా కాపాడతారు.
అవగాహన లోపమే శాపం
వెంటనే వైద్య సేవలు పొందాలి
మద్యం, సిగరెట్లు తాగే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కువగా నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వైద్య పరీక్షలు చేయించుకుని తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించి 30 రోజులకు అవసరమయ్యే మందులు అందజేస్తున్నాం. ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా సర్వే చేపట్టింది. – దాము వంశీ,
జిల్లా ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్
ఒత్తిడితో ఆరోగ్యం చిత్తు
ఒత్తిడితో ఆరోగ్యం చిత్తు


