ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, ఆలయ సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.
రేపు బీచుపల్లిలో
సీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా సోమవారం సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ కార్యక్రమాన్ని కనులారా తిలకించాలని ఆయన కోరారు.
వేరుశనగ క్వింటా రూ.6,712
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 1410 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 6712, కనిష్టం రూ. 3000, సరాసరి రూ. 5499 ధరలు లభించాయి. అలాగే, 37 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5889 కనిష్టం రూ. 5659, సరాసరి రూ. 5859 ధరలు పలికాయి. 337 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2166, కనిష్టం రూ. 1751, సరాసరి ధరలు రూ. 1911 వచ్చాయి.
చేనేత సమస్యల
పరిష్కారానికి మహాధర్నా
కొత్తకోట: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 20న కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపడతామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పొబ్బతి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని వీవర్స్‌కాలనీలో జరిగిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా.. నేటికీ అమలు కాలేదన్నారు. 15 రోజుల్లో రుణమాఫీ నిధులు కార్మికుల ఖాతాల్లో జమ చేయకపోతే హైదరాబాద్ నాంపల్లిలోని హ్యాండ్‌లూమ్ టెక్స్‌టైల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో ఉన్న చేనేత చేయూత నగదు బదిలీ పథకం స్థానంలో చేనేత భరోసా పథకాన్ని నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆరోపించారు. నేతన్న బీమా పథకాన్ని వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవ్వాలని నిర్ణయించడం సంతోషమేగాని.. మరణించిన నేత కార్మికులకు ఏడాది గడిచినా బీమా సొమ్ము అందకపోవడం విచారకమని తెలిపారు. చేనేత సహకార సంఘాలకు 12 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికలు జరుపలేదని.. చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఏడాది దాటిందని, తక్షణమే నిర్వహించి టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కల్పనకు ప్రభుత్వ రంగంలోని ఏకరూప దుస్తులకు మగ్గాలపై నేసిన వాటినే అందించాలని సూచించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు సాంబరి వెంకటస్వామి, పగిరాకుల రాములు, ఎంగలి రాజు, కొంగటి శ్రీనివాసులు, కొంగటి వెంకటయ్య, దిడ్డి శ్రీకాంత్, గోరంట్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు


