సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 2 2026 1:11 AM | Updated on Nov 2 2026 1:11 AM

న్యూస్‌రీల్‌

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత వెంటాడుతోంది. జిల్లాలో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రెండో విడత (పార్ట్‌–2) పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ చేరలేదు. ఇప్పటికే పార్ట్‌–1 పాఠ్యాంశాలు పూర్తికాగా.. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన మరుసటి రోజు నుంచే పార్ట్‌–2 పాఠాలు ప్రారంభం కావాల్సి ఉంది. సమ్మెటివ్‌–1 పరీక్షల వరకు మాత్రమే పార్ట్‌–1 పాఠ్యాంశాలు ఉండటంతో తదుపరి పాఠ్యాంశాల బోధనకు పుస్తకాలు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డిపోలోనే 42వేల పుస్తకాలు

జిల్లాకు అవసరమైన సుమారు 42వేల పాఠ్యపుస్తకాలు రెండు నెలల క్రితమే పుస్తకాల డిపోకు చేరినట్లు సమాచారం. ఇప్పటివరకు వాటిని పాఠశాలలకు తరలించకపోవడం విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన సమయంలోనే పుస్తకాల రవాణా జరగాల్సి ఉండగా, రవాణా ఖర్చుల చెల్లింపులు పెండింగ్‌లో ఉండటంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులే బలి

ఒకవైపు విద్యా క్యాలెండర్‌ ప్రకారం పాఠ్యాంశాలు ముందుకు సాగాల్సి ఉండగా, మరోవైపు పుస్తకాలు అందక విద్యార్థులు పాఠాలను అనుసరించలేని పరిస్థితి నెలకొంది. పుస్తకాలు లేకుండా బోధన ఎలా కొనసాగించాలన్న ప్రశ్న ఉపాధ్యాయులను వేధిస్తోంది. రెండు నెలలుగా డిపోలోనే పుస్తకాలు మూలుగుతున్నా పంపిణీకి చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి రవాణా ఖర్చుల సమస్యను పరిష్కరించి, వెంటనే పాఠ్యపుస్తకాలను అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరవేయాలని కోరుతున్నారు.

డిపో మేనేజర్‌తో మాట్లాడుతాం..

ఈ విషయంపై జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి లలితను వివరణ కోరగా.. పాఠ్యపుస్తకాలను త్వరలోనే పాఠశాలకు పంపించే విధంగా డిపో మేనేజర్‌తో మాట్లాడుతామన్నారు. పుస్తకాలు మండలాలకు చేరవేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చేస్తామని తెలిపారు.

రవాణా ఖర్చులే అడ్డంకిగా..

పుస్తకాల రవాణా చేసిన డిపో ఇన్‌చార్జ్‌కి చెల్లించాల్సిన ట్రాన్స్‌పోర్టు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అడ్వాన్స్‌ చెల్లిస్తేనే పుస్తకాలను పాఠశాలలకు తరలిస్తానని సదరు ఇన్‌చార్జ్‌ పది రోజుల క్రితం డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పుస్తకాలు డిపోకే పరిమితమయ్యాయి.

పార్ట్‌–1 పాఠ్యాంశాలు పూర్తి

డిపోలో మూలుగుతున్న

42వేల పుస్తకాలు

రవాణా ఖర్చుల చెల్లింపుల్లో జాప్యమే కారణమా?

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు.

బోధనపై తీవ్ర ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement