మల్హర్(కాటారం): భగవంతుడు సర్వాంతర్యామి అని, ఆయనకు అనేక రూపాలు, కోటానుకోట్ల పేర్లు ఉన్నాయని.. ఏ రూపంలో స్మరించినా భక్తులకు కనిపిస్తూ వారి కోరికలు తీరుస్తారని అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు కాటారం మండలం ధన్వాడకు చేరుకున్న స్వామీజీకి మంత్రి శ్రీధర్‌బాబు ఘనస్వాగతం పలికారు. శ్రీధర్‌బాబు నివాసానికి చేరుకున్న స్వామీజీ, ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోకకల్యాణార్థం నిర్వహించిన మహాపూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు ఆశీస్సులు అందించారు.
మూడేళ్ల నిరీక్షణ ఫలించింది: మంత్రి దుద్దిళ్ల
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. స్వామివారి దివ్య ఆశీస్సులు లభించడం గొప్ప అదృష్టమన్నారు. మూడేళ్లుగా అమ్మ, జయశ్రీ, సతీమణి, కుటుంబ సభ్యుల నిరీక్షణ నేడు ఫలించిందన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు, ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు, ముఖ్యంగా మంథని, ధన్వాడ ప్రజలు అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి ప్రార్థించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్ దంపతులు, మంత్రి లక్ష్మణ్ కుమార్ సతీమణి, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు.
అవదూత దత్త పీఠాధిపతి
గణపతి సచ్చిదానంద స్వామీజీ


