భూపాలపల్లి అర్బన్: పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని 17వ వార్డు సుభాష్ కాలనీలో సీపీఐ శాఖ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన జెండా గద్దెను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మోటపలుకుల రమేశ్, క్యాతరాజ్ సతీశ్, నూకల చంద్రమౌళి పాల్గొన్నారు.
ఇంకెప్పుడిస్తారు..?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు నిర్వహించిన సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా సేవలందించిన హోటల్ నిర్వాహకుడికి ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. అంత్య పుష్కరాల సందర్భంగా పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్లో ప్రైవేట్‌గా లీజుకు తీసుకుని శ్రీ వేంకటేశ్వర రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న వెంకటేశ్ 12 రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, వీవీఐపీలు, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అధికారులకు భోజనాలు, టిఫిన్లు, టీ తదితర సేవలను అందించాడు. ఈ సేవల కోసం సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు జూన్ నెలలో అందజేసినప్పటికీ.. ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. కొంతమందికి బిల్లులు చెల్లించి, మరికొంత మందికి బిల్లుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. బిల్లుల చెల్లింపు కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ నిత్యం తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట అప్పులు చేసి పుష్కరాల సమయంలో ఆహార పదార్థాలు, ఇతర అవసరాల కోసం ఖర్చు చేశానని, బిల్లులు అందకపోవడంతో అప్పులపై వడ్డీలు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వెంకటేశ్ వాపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో హోటల్‌ను కూడా మూసివేసినట్లు పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు సేవలందించిన తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరుతున్నారు. కలెక్టర్ స్పందించి తనకు రావాల్సిన సుమారు రూ.3లక్షల బిల్లులను తక్షణమే విడుదల చేసి సమస్య పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
రాజుకు జాతీయ పురస్కారం
కాళేశ్వరం: మహదేవపూర్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ పంతకాని రాజుకు తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ జాతీయ పురస్కారం లభించింది. హైదరాబాద్ మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ‘ప్రొజెన్ ఇన్ టైమ్’ పుస్తకావిష్కరణ, కాకతీయ వారసత్వ చిత్రాల ప్రదర్శన, పురస్కార ప్రదానోత్సవంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. జాతీయ ఫొటోగ్రఫీ సదస్సు 2019లో చిత్రీకరించిన అద్భుతమైన ఛాయాచిత్రాలతో ‘ప్రొజెన్ ఇన్ టైమ్ ఎ ఫొటోగ్రాఫిక్ ఓడ్ టు కాకతీయ హెరిటేజ్’ పుస్తకాన్ని రూపొందించారు. 2024–2026 మధ్య నిర్వహించిన పోటీల నుంచి ఎంపిక చేసిన 127 ఉత్తమ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫైన్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శనలో పంతకాని రాజు ట్రైబల్, ఒడిశా బోండా ట్రైబ్ రెండు చిత్రాలకు చోటు లభించింది.


