రోడ్డు వేయకపోతే ఆందోళన బాటపడతాం
మహాముత్తారం: మండల పరిధిలో పలు ప్రధాన రహదారులు అధ్వానంగా తయారై ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. మహాముత్తారం మండలం బోర్లగూడెం నుంచి నర్సింగాపూర్ వెళ్లే సుమారు నాలుగు కిలోమీటర్ల ప్రధాన రహదారితో పాటు హుజుర్‌నగర్ నుంచి మహాముత్తారం మండల కేంద్రానికి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. కొన్నేళ్లగా సరైన నిర్వహణ లేకపోవడంతో రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి రాకపోకలు సాగించలేని దుస్థితి నెలకొంది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు, ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. కనుకునూర్, రెడ్డిపల్లి, బోర్లగూడెం, పెగడపల్లి స్తంబంపల్లి (పీపీ), రేగులగూడెం తదితర గ్రామాల ప్రజలు మండల, జిల్లాకేంద్రానికి చేరుకోవడానికి బోర్లగూడెం, నర్సింగాపూర్ గ్రామాల మీదుగా వాహనాలు వెళ్తుంటాయి. ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం పడిందంటే గుంతల్లో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేసి నూతన రోడ్లను నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
నర్సింగాపూర్ బోర్లగూడెం,
హుజూర్‌నగర్ మహాముత్తారం
మార్గాల్లో నరకయాతన
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
నర్సింగాపూర్ నుంచి బోర్లగూడెం వెళ్లే ప్రధాన రహదారి నామరూపాలు లేకుండా పోయింది. రోడ్డుపై గుంతలు ఉన్నాయో గుంతల్లో రోడ్డు ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బైకుపై వెళ్లాలన్నా నడుము నొప్పి వస్తుంది. రైతులు ఎడ్లబండ్లతో పొలాలకు వెళ్లలేకపోతున్నారు. అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నూతన రహదారి నిర్మించాలి.
– ముదురుకోళ్ల రవి, బోర్లగూడెం


