భూపాలపల్లి రూరల్: కరువు పరిస్థితులను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం సరికాదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ నాయకులు మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారని విమర్శించారు. కరువు నివారణకు రాజకీయాలకు అతీతంగా అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అందుకు బాధ్యత వహిస్తూ అప్పటి పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఒక్క ఎకరానికీ నీరు అందలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు, తదుపరి చర్యల విషయంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోందని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా సర్పంచ్‌లు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. బావులు, బోర్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించి, అవసరమైన చోట నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయాలన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, పక్షులకు సైతం తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఉపాధి హామీ పథకం ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి భూగర్భ జలాల పెంపునకు, గ్రామాల్లో నీటి లభ్యత మెరుగుపడేందుకు కృషి చేయాలని సూచించారు. రైతులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పార్టీలకు అతీతంగా కరువు నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే
కన్నెపల్లి సందర్శన
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


