భూపాలపల్లి అర్బన్: వేసవికాలం.. పైగా ఎండలు అధికంగా ఉన్న దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్నాయి. అందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లావ్యాప్తంగా 430 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 24 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒంటి పూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో యథావిధిగా మధ్యాహ్న భోజనం కొనసాగనుంది. అందుకు గాను విద్యాశాఖ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. తరగతులు పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని సూచించారు.
ఎమ్మెల్యే పరామర్శ
చిట్యాల: మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలో క్రేన్ వైర్ తెగి మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, చిలుకల రాయకోంరు, గుర్రపు తిరుపతి గౌడ్, బుర్ర శ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ రఫీ, అల్లం రాజు ఉన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు
మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు మండలంలోని కాటారం ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 13నుంచి ఈనెల 15 (ఆదివారం) వరకు హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలో జరుగుతున్న సీనియర్ మెన్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో చరణ్, శివబాలాజీ పాల్గొంటున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలారం, పీడీ కుడిమేత మహేందర్, పీటీ మంతెన శ్రీనివాస్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల సందడి
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి చరిత్ర, ఆలయ పురాణం వివరించి ఆశీర్వచనం ఇచ్చారు.


