పరిశీలిస్తూ.. సూచనలు చేస్తూ..
● పుష్కర ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన
భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరం పుష్కర ప్రాంతాల్లో ఆదివారం కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. సరస్వతి ఘాట్, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే త్రివేణి సంగమం, వైద్యారోగ్య శిబిరాలు, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయం, పుష్కర విధులు నిర్వహించే సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనశాల తదితర ప్రాంతాలల్లో పర్యటించారు. భక్తులతో ముచ్చటించి, సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత శాఖల అధికారులతో వాకీటాకీలో మాట్లాడి పలు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూశారు. రేపు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున నది తీరంలో అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయించాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. సంగమ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి తొలగింపజేయించాలని, తాను మళ్లీ వస్తానని, మార్పు లేకపోతే చర్యలు తప్పవని పంచాయతీ అధికారులను హెచ్చరించారు. దేవస్థానంలో దర్శనానికి ఎంత సమయం పడుతుందని భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తాగునీరు అందించాలని సూచించారు.


