జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..
ఫోన్ ఇన్‌లో
మాట్లాడుతున్న
డీఎంహెచ్‌ఓ చల్లా మధుసూదన్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే పలు రకాల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియో, సైనసైటిస్ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు వస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్‌లో ప్రజల సమస్యలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న: చలి తీవ్రతకు ఎటువంటి జాగ్రతలు
పాటించాలి (అజయ్, సాదన్‌రెడ్డి, కాటారం)
డీఎంహెచ్‌ఓ: చలి తీవ్రతకు గురికాకుండా ఉండేందుకు నూలు, ఉన్ని దుస్తువులను ధరించాలి. చెవులు, ముక్కు నుంచి చల్లటి గాలి శరీరంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. వేడివేడి భోజనం తినాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి.
ప్రశ్న: చిన్న పిల్లలు ఎటువంటి జాగ్రతలు
పాటించాలి (దేవేందర్‌రావు, రేగొండ)
డీఎంహెచ్‌ఓ: ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లల చేతులకు గ్లౌజులు, మాస్కులు, స్వెటర్లు వేయాలి. వేడి అన్నం తినిపించారు. వేడి నీరు తాగే విధంగా చూసుకోవాలి. ఆస్తమా లాంటివి ఉన్నట్లయితే నెబులైజర్ వినియోగించాలి.
ప్రశ్న: చిట్యాల సీహెచ్‌సీలో వైద్యులను నియమించాలి. ప్రతీ వారం స్పెషలిస్టులతో పరీక్షలు చేయించాలి (బుర్ర వెంకటేష్, బుర్ర తిరుపతి, చిట్యాల)
డీఎంహెచ్‌ఓ: చిట్యాల మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో డాక్టర్ల నియమాకంపై కలెక్టర్, డీసీహెచ్‌ఎస్‌లు దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు డాక్టర్లను నియమించారు.
ప్రశ్న: రోజుల తరబడి పిల్లలకు దగ్గు, జలుబు తగ్గడం లేదు. (పసన్నకుమారి, టేకుమట్ల)
డీఎంహెచ్‌ఓ: శీతాకాలం నేపథ్యంలో వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు అధికంగా వస్తాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఆస్తమా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు నెబులైజర్ వినియోగించాలి. వెచ్చదనంగా ఉండే దుస్తులను వేయాలి.
ప్రశ్న: గర్భిణులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి
(అంబాల కిరణ్, టేకుమట్ల)
డీఎంహెచ్‌ఓ: చలిని తట్టుకునేందుకు గర్భిణులు కొంత మంది పొద్దంతా ఎండలోనే ఉంటారు కానీ అలా ఉండొద్దు. ఉదయం 9గంటలలోపు మాత్రమే ఎండలో ఉండాలి. దీంతో డీ విటమిన్ వస్తుంది. ఉదయం 10గంటల తరువాత, సాయంత్రం ఐదు గంటలలోపు మాత్రమే ప్రయాణాలు చేసుకోవాలి. లూజుగా ఉండే దుస్తువులను ధరించాలి.
చలితో జ్వరం, జలుబు
బారిన పడే ప్రమాదం
‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో డీఎంహెచ్‌ఓ
డాక్టర్ చల్లా మధుసూదన్
ప్రశ్న: ఆస్తమా ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలి (వెంకటేష్, కొడవటంచ)
డీఎంహెచ్‌ఓ: నూలు, ఉన్ని ఉన్న దుస్తువులు ధరించాలి. చలి ఉండే సమయంలో గదిలో నుంచి బయటకు రావద్దు. ముక్కు, చెవుల నుంచి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. వేడి అన్నం తినాలి. వ్యాధి తీవ్రతను బట్టి నెబులైజర్ వినియోగించుకోవాలి. ఉదయం 10గంటల తరువాతనే బయటకి రావాలి. చల్లటి గాలిలో పడుకోకూడదు. బీపీ ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..


