డేంజర్ మలుపులు
పొంచి ఉన్న ప్రమాదం.. ఈనెల 15నుంచి సరస్వతి పుష్కరాలు
కాళేశ్వరం: పన్నెండేళ్లకొకసారి వచ్చే సరస్వతి నది పుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా రానున్నారు. ఈనెల 15నుంచి 26వరకు సరస్వతి పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారు. కాటారం టు కాళేశ్వరం వంతెన వరకు ఎన్‌హెచ్ 353(సీ) రహదారిపై 20కిపైగా మలుపులు ఉన్నాయి. కాళేశ్వరం టు వయా మద్దుపల్లి మీదుగా గంగారం వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు సంబంధించి పలుచోట్ల ‘మహా’డేంజర్ మలుపులు ఉన్నాయి. తెలియని వారు ఆదమరిచి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సూచికబోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తే ప్రయాణం సాఫీగా సాగనుంది.
పలురాష్ట్రాల భక్తుల రాక..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేయనున్నారు. భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ రహదారుల వెంట వస్తారు.
డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలి..
పుష్కరాలు జరిగే రోజుల్లో పోలీసులు వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలి. మద్యం మత్తులో మలుపులు తెలియక అడవిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలకు ఢీకొని ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ దిశగా అధికార యంత్రాంగం దృష్టిసారించాలి.
సూచిక బోర్డులేవి..
రహదారుల వెంట సూచికబోర్డులు, ఫ్లెక్సీలు దారులు తెలిపేలాగా అమర్చితే ప్రమాదాలు నివారించొచ్చు. మలుపులపై అవగాహన లేకపోతే రోడ్డు ప్రమాదాల భారినపడే ప్రమాదం ఉంది. ఇటీవల మహాశివరాత్రి రోజు స్కూటీపై దర్శనానికి వచ్చి వెళ్తున్న దంపతులు అన్నారం మలుపు వద్ద అదుపుతప్పి పడిపోయారు. భార్య భాగ్యలక్ష్మి (50) అక్కడికక్కడే మృతిచెందింది. వారం రోజు కిందట మంథనికి చెందిన కుడుదుల అనిల్(20)బైక్‌పై వచ్చి ప్రమాదానికి గురై మృత్యువాతపడ్డాడు. మలుపుల వద్ద అధికారులు దృష్టి సారించకపోతే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సూచిక బోర్డులు, ప్రమాదాలు జరిగే ప్రదేశం లాంటి ప్లెక్సీలు పెడితే డ్రైవర్లకు అవగాహన వస్తుంది.
ఆదమరిస్తే అంతే..
కాటారం టు కాళేశ్వరం వరకు, కాళేశ్వరం టు గంగారం రహదారుల్లో మలుపులు చాలా వరకు ఉన్నాయి. కాళేశ్వరం వంతెన నుంచి మహదేవపూర్ వరకు సుమారు 18వరకు మలుపులు ఉన్నాయి. గంగారం దారిలో 10కి పైగా మలుపులు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఆదమరిస్తే ప్రాణాలు గాలిలో కలువాల్సిందే. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే.
తెలంగాణతో పాటు
ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక
కాటారం టు కాళేశ్వరం, కాళేశ్వరం టు గంగారం వరకు పలుచోట్ల మలుపులు
ఆదమరిచి వాహనాల్లో ప్రయాణిస్తే ప్రమాదాలకు అవకాశం
మలుపుల వద్ద సూచిక బోర్డులు కరువు
ప్రమాదాలు జరగకుండా చర్యలు..
సరస్వతినది పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతున్నాం. ఫ్లెక్సీలు, సూచిక బోర్డులు ప్రైవేట్ ఏజెన్సీకి ఎండోమెంట్‌శాఖ అప్పగించింది. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నాం. ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేస్తాం.
– రామచందర్‌రావు, సీఐ, మహదేవపూర్
డేంజర్ మలుపులు


