జిల్లాలో వీబీ జీరాంజీ గణాంకాలు
గతంతో పోలిస్తే అధికం..
ఎల్‌నినో ప్రభావంతో వీబీ జీరాంజీ పనులకు పెరిగిన డిమాండ్
జనగామ: ఎల్‌నినో ప్రభావం..వర్షాభావ పరిస్థితులు..తీవ్ర కరువు ఛాయలు.. వెరసి వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో గ్రామీణ కూలీలు ఉపాధి హామీ(వీబీ జీరాంజీ) పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. గతంలో జాబ్ కార్డులు ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పనులకు వెళ్లనివారు సైతం ప్రస్తుతం వీబీ జీరాంజీ పనులకు హాజరవుతున్నారు. బయట రోజువారీ కూలీ పనులు దొరకడం కష్టంగా మారడం, వచ్చే సీజన్‌లో పంటల సాగుపై అనిశ్చితి నెలకొనడంతో వీబీ జీరాంజీ గ్రామీణ కుటుంబాల కు కొంత భరోసాగా మారుతోంది. జిల్లాలో రోజు రోజుకూ కూలీల హాజరు పెరుగుతుండటం ప్రస్తు త పరిస్థితులకు అద్దం పడుతోంది.
పెరుగుతున్న హాజరు
ప్రస్తుతం గ్రామాల్లో ఫాంపాండ్స్ తదితర పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా 14,951 మంది కూలీలు పనులకు హాజ రు కాగా, 4వ తేదీన ఏకంగా రికార్డు స్థాయిలో 15,036 మంది హాజరయ్యారు. ఉపాధి పనులకు కూలీల హాజరు పెరుగుతుండటంతో రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా టాప్–5, 6 స్థానాల్లో నిలుస్తోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మరికొన్ని చోట్ల ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కూలీకి రోజుకు సగటున రూ.200 నుంచి రూ.270 అంతకంటే ఎక్కువ కూలి లభిస్తోంది.
కరువు భయాలతో ఉపాధే ఆధారం
ఎల్‌నినో ప్రభావంతో వచ్చే యాసంగి, వానా కాలం సీజన్‌లలో పంటల సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వర్షాభావంతో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువైంది. ప్రైవేటు పనులు దొరకని పరిస్థితుల్లో కుటుంబ పోషణకు జాబ్‌కార్డు ఉన్నవారు ఉపాధి పనులను ఆశ్రయిస్తున్నారు. అయితే పనులు చేసిన అనంతరం ఫొటో క్యాప్చర్ సమయంలో సర్వర్, సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఫొటోలు తీసే ప్రక్రియలో నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు.
పనిదినాలు, కూలీ పెంచాలని వినతి
ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వీబీ జీరాంజీ పథకాన్ని మరింత విస్తరించాలని కూలీలు కోరుతున్నారు. ఒక్కో కుటుంబానికి పనిదినాల సంఖ్య పెంచడంతో పాటు కూలి రేట్లు కూడా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపాధి పనులకు ఆరుతడి పంటలు, కూరగాయల సాగును అనుసంధానం చేస్తే రైతులకు పెట్టుబడి భారం తగ్గడంతో పాటు కూలీలకూ పని దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు. కూలి డబ్బులను అదే వారంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రోజురోజుకూ రికార్డు స్థాయిలో హాజరు
4వ తేదీన 15,036 మంది..
వ్యవసాయ, ఇతర పనులు
లేకపోవడంతో ఉపాధే ఆధారం
మహిళా కూలీలే అధికం..
పనిదినాలు, కూలి పెంచాలని వినతి
గ్రామ పంచాయతీలు: 280
మొత్తం జాబ్‌కార్డులు: 1,17,145
యాక్టివ్ జాబ్‌కార్డులు: 74,220
మొత్తం కూలీలు: 1,42,373
రోజువారీ కూలీలు
(గణాంకాల ప్రకారం): 1,20,998
మహిళా కూలీలు: 71,120
ఒక్కో గ్రామంలో సగటున హాజరు: 53 మంది
ఈనెల 3న హాజరు: 14,951
ఈనెల 4న హాజరు: 15,036
రోజువారీ సగటు కూలీ : రూ.200–రూ.270 పైన
జిల్లాలో వీబీ జీరాంజీ పనులకు వచ్చే కూలీల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరి గింది. గతేడాది ఇదే సమయానికి కేవలం 3,471 మంది మాత్రమే పనులకు హాజరుకాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 15,036కు చేరింది. అంటే అదనంగా 11,565 మంది కూలీలు పెరిగారు. మొత్తంగా 333 శాతం వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనుల అవసరానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. కూలీలకు స్థానికంగానే పని లభిస్తుండటం ఇందుకు కారణంగా కనిపిస్తోంది.


