నూతన భవనంలో ప్రత్యేక వసతి
జనగామ: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు 2026–27 విద్యా సంవత్సరానికి 48 పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) సీట్లు మంజూరయ్యాయి. వైద్య కళాశాలలో పీజీ కోర్సుల ప్రారంభానికి సంబంధించి అన్ని విభాగాల్లో తనిఖీలు పూర్తి కాగా, 50 సీట్ల కోసం ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే రెండు సీట్లు తగ్గి 48 సీట్లకు అనుమతి లభించింది. దీంతో ఇప్పటి వరకు ఎంబీబీఎస్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇకపై వైద్య నిపుణుల ను తయారుచేసే దిశగా మరో ముందడుగు వేసింది. మొత్తం 12 విభాగాల్లో ఎండీ, ఎంఎస్ కోర్సులకు సీట్లు కేటాయించారు. ఇందులో ఎండీ అనస్థీషియాలజీకి 4, అనాటమీకి 4, జనరల్ మెడిసిన్‌న్‌కు 5, మైక్రోబయాలజీకి 2, పీడియాట్రిక్స్‌కు 4, పా థాలజీకి 4, ఫార్మకాలజీకి 4, ఫిజియాలజీకి 4, సైకియాట్రీకి 3 సీట్లు మంజూరయ్యాయి. అదే విధంగా ఎంఎస్ జనరల్ సర్జరీకి 4, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీకి 6, ఆర్థో పెడిక్స్‌కు 4 సీట్లు కేటాయించారు.
వైద్యవిద్యలో మరో మైలురాయి
పీజీ సీట్ల మంజూరుతో కళాశాలలో వైద్య విద్యా ప్రమాణాలు, వైద్య సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మూడు సంవత్సరాల పాటు కొనసాగే పీజీ కోర్సుల ద్వారా వివిధ వైద్య విభాగాల్లో నిపుణులైన వైద్యులు తయారుకానున్నారు. అంతేకాకుండా పీజీ విద్యార్థుల సేవలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్యసేవలు మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, అనస్థీషియాలజీ వంటి కీలక విభాగాల్లో పీజీ వైద్యుల అందుబాటు ప్రయోజనకరంగా మారనుంది.
ప్రస్తుతం మంజూరైన పీజీ సీట్లకు సంబంధించిన ప్రవేశాలు, విద్యా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలు కానుంది. మరోవైపు నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం ప్రారంభమైన అనంతరం పీజీ విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. తరగతులు, క్లినికల్ శిక్షణతో పాటు వసతి పరంగా కూడా అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జిల్లా కేంద్రంలోనే ఉన్నత వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు, భవిష్యత్తులో స్థానికంగా నిపుణులైన వైద్యుల కొరత తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.
12 విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు అనుమతి
50 సీట్ల ప్రతిపాదనకు 48 మంజూరు
వచ్చే నెల నుంచి ప్రవేశాల ప్రక్రియ


