ఫారం–18 దరఖాస్తుల పరిశీలన వేగవంతమవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఫారం–18 దరఖాస్తుల పరిశీలన వేగవంతమవ్వాలి

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

జనగామ రూరల్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కలకు సంబంధించి ఓటరు నమోదు కోసం వచ్చిన ఫారం–18 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెలో కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా హాజరయ్యారు. ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ..తిరస్కరించిన దరఖాస్తులకు స్పీకింగ్‌ ఆర్డర్‌తో సహా ఇవ్వాలని ఈనెల 25న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎలక్టోరల్‌ క్లబ్‌ల ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యం, ఓటు హక్కు, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

టార్పాలిన్లు

అందుబాటులో ఉండాలి

బచ్చన్నపేట : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు గన్నీబ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) బెన్‌షాలోమ్‌ సూచించారు. గురువారం మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తేమ శాతం, తదితర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. కొనుగోలు చేసిన ధాన్యం కాంటా అవ్వగానే ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలించాలని, ఎటువంటి నిర్లక్ష్యం తగదని, ఓపీఎంఎస్‌లో వెంటనే నమోదు చేయాలని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. పరిశీలనలో సంబంధిత అధికారులు, ఎంఆర్‌ఐ మున్వర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

డీఐఈఓగా వీరేందర్‌

జనగామ రూరల్‌: డీఐఈఓగా ఎన్‌.వీరేందర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ ఐఎఏస్‌ అధికారి అభిలాష్‌ అభినవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో దేవరుప్పుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఇన్‌చార్జిగా డీఐఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో జిల్లా డీఐఈఓగా ములుగు జిల్లా మంగపేట జూనియర్‌ ప్రిన్సిపల్‌ ఇన్‌చార్జి డీఐఈఓగా పని చేసిన ఎన్‌.వీరేందర్‌ జిల్లా డీఐఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రతిభకు

యువజనోత్సవాలు వేదిక

జనగామ రూరల్‌: ప్రతిభకు యువజనోత్సవాలు ఒక గొప్ప వేదిక అని జిల్లా యువజన క్రీడల అధికారి ఎన్‌ఎల్‌ నరసింహారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు, సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో కూడా విజేతలుగా నిలిచి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిలబెట్టాలన్నారు. జానపద నృత్యం, జానపద గీతం, చిత్రలేఖనం, కవితా రచన విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కాగా యువత వివిధ సాంప్రదాయ నృత్యాలు చేయగా విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ జూనియర్‌. డిగ్రీ కళాశాలలకు చెందిన యువతీ యువకులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు మాన్యత

దేవరుప్పుల: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు మండలంలోని పెద్దమడూరుకు చెందిన పోకల రాము కూతురు మాన్యత ఎంపికైంది. మండలంలోని పెద్దమడూరుకు చెందిన పోకల మాన్యత ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉన్న ఆమె జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై గ్రామస్థులు అభినందనల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement