ప్రతిభ చాటేలా.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ చాటేలా..

Oct 23 2026 12:57 AM | Updated on Oct 23 2026 12:57 AM

ఐదు క్రీడాంశాల్లో

పోటీలు

కలెక్టర్‌ కప్‌ ఇండోర్‌ గేమ్స్‌కు

సన్నాహాలు

ఆసక్తి పెంచుకునేలా

జనగామ: జిల్లాలో విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు విస్తృత స్థాయిలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘కలెక్టర్‌ కప్‌ ఇండోర్‌ గేమ్స్‌–2026’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈనెల 23(శుక్రవారం) నుంచి ఈ నెల 31 వరకు పాఠశాల స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అనంతరం మండల స్థాయి పోటీలు, జిల్లా స్థాయి ఫైనల్స్‌ ఉంటాయి. ఈ పోటీల నిర్వహణతో పాటు మండల స్థాయిలో అన్ని సబ్జెక్టుల క్విజ్‌, ఫాస్ట్‌ మ్యాథ్స్‌ పోటీలకు కూ డా ఏర్పాట్లు చేయాలని మండల విద్యాధికారులకు కలెక్టర్‌ సూచించారు.

పాఠశాల నుంచి జిల్లా స్థాయి వరకు

పాఠశాల స్థాయిలో ప్రతీ ఈవెంట్‌కు ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి మండల స్థాయి పోటీలకు పంపించాలి. ఈ నెల 31వ తేదీ సాయంత్రంలోగా మండల స్థాయిలో పాల్గొనే విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులు సంబంధిత మండల విద్యాధికారులకు అందజేయాలి. వచ్చే నెల 2న మండల విద్యాధికారులు ఈ వివరాలను జిల్లా కార్యాలయానికి సమర్పించాలి. వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ మధ్య ఏదో ఒక రోజు మండల స్థాయి పోటీలు నిర్వహించి, జిల్లా స్థాయికి ఎంపికై న విద్యార్థుల వివరాలను 7వ తేదీ మధ్యాహ్నంలోగా జిల్లా కార్యాలయానికి పంపించాలి.

క్విజ్‌, ఫాస్ట్‌ మ్యాథ్స్‌ పోటీలు..

మండల స్థాయిలో అన్ని సబ్జెక్టుల క్విజ్‌, ఫాస్ట్‌ మ్యాథ్స్‌ క్విజ్‌, కలెక్టర్‌ కప్‌ ఇండోర్‌ గేమ్స్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ప్రతి మండలంలో ఎంఈఓ ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోటీల నిర్వహణకు సంబంధించిన వివిధ బాధ్యతలను కమిటీ సభ్యులకు కేటాయించాలి. ఈ కమిటీల వివరాలను జిల్లా కార్యాలయంలో సమర్పించాలి. జిల్లా స్థాయి పోటీల్లో 12 మండలాల నుంచి ఒక్కో ఈవెంట్‌కు ఇద్దరు చొప్పున అర్హత సాధిస్తే, మొత్తం 22 ఈవెంట్లలో సుమారు 528 మంది పాల్గొనే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తోంది. జిల్లా స్థాయి ఫైనల్స్‌ను వచ్చేనెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇదే సమయంలో జిల్లాకు కేటాయించిన అండర్‌–14 బాలురు, బాలికల రాష్ట్ర స్థాయి సెపక్‌ తక్రా ఎంపిక పోటీలను నవంబర్‌ 12 నుంచి 14 వరకు నిర్వహించాలని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయి పోటీల తేదీలు ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ పోటీల షెడ్యూల్‌ నిర్ధారణకు లోబడి ఉండనున్నాయి. ఇండోర్‌ గేమ్స్‌ మాత్రం ప్రత్యేక జిల్లా స్థాయి పోటీలుగా కొనసాగుతాయి. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు నిర్దేశించిన గడువుల్లో విద్యార్థుల వివరాలు పంపించి, ఆర్గ నైజింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసి పోటీల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ గేమ్స్‌ విద్యార్థుల తరగతులకు అంతరాయం కలుగకుండా నిర్వహించనున్నారు.

కలెక్టర్‌ కప్‌లో చెస్‌, క్యారమ్స్‌, బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌, టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌, యోగాసనంలో పోటీలు నిర్వహిస్తారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనేలా ఈ పోటీలను రూపొందించారు. అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారు. చెస్‌, క్యారమ్స్‌లో ప్రత్యేకంగా సీడబ్ల్యూఎస్‌ఎన్‌ (ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు) విభాగాన్ని కూడా ప్రతిపాదించారు. మొత్తం 22 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, ప్రభుత్వ గురుకులాలతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

నేటి నుంచి పాఠశాల స్థాయి పోటీలు

నవంబర్‌ 2 నుంచి 6 వరకు మండల స్థాయి..

చెస్‌, క్యారమ్స్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, యోగాసనాల్లో అవకాశం

క్విజ్‌, ఫాస్ట్‌ మ్యాథ్స్‌ పోటీల నిర్వహణకు కమిటీల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement