● ఏకంగా 349 దరఖాస్తుల రాక
● రేపు కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ
జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బార్ లైసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క బార్ లైసెన్స్ కోసం 349 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు బుధవారం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎన్. అంజిరెడ్డి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన బార్ల ఏర్పాటు కోసం గత నెల 27న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక 2బీ బార్ ఏర్పాటునకు అనుమతి ఇవ్వాలని నోటిఫికేషన్లో పేర్కొంది.
రూ.లక్ష దరఖాస్తు రుసుము..
ఈ బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు రుసుమును రూ.లక్షగా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. గడువు ముగిసే సమయానికి మొత్తం 349 దరఖాస్తులు వచ్చాయి.
రేపు లాటరీ ద్వారా ఎంపిక..
బార్ లైసెన్స్ కేటాయింపునకు సంబంధించి ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు జనగామ కలెక్టరేట్లో లాటరీ నిర్వహించనున్నారు. కలెక్టర్ సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అంజిరెడ్డి తెలిపారు.


