జనగామ: జిల్లాలో 2026–27 సీజన్లో పత్తి రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందించేందుకు 13 కాటన్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా గుర్తించారు. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద తక్కువ ధరకు పత్తి విక్రయించి రైతులు నష్టపోకుండా చూడటమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. జిల్లాలో సుమారు 35వేల మంది రైతులు 1.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఎకరాకు సగటున ఆరు క్వింటాళ్ల చొప్పున సుమా రు ఆరు లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
ఏఎంసీల పరిధిలో కేంద్రాలు
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 13 పత్తి కొనుగోలు కేంద్రాలను గుర్తించారు. రాజవరం గ్రామంలోని సిరి కాటన్ ఇండస్ట్రీస్, శివునిపల్లిలో శ్రీ శివసాయి కాటన్ ఇండస్ట్రీస్, పటేల్‌గూడెంలో తాజ్ సైలాని కాటన్ ఇండస్ట్రీస్, నెల్లుట్లలోని కటుకూరి రామనారాయణ గ్రెయిన్స్ అండ్ జనరల్ మర్చంట్, (ఓం శాంతి కాటన్ ఇండస్ట్రీస్), సత్యసాయి కాటన్ ఇండస్ట్రీస్, శ్రీ రామలింగ కాటన్ ఇండస్ట్రీస్‌లను గుర్తించారు. రఘునాథపల్లి మండలంలోని సిరి కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్, హరిహర కాటన్ జిన్నింగ్ మిల్, శ్రీనివాస కాటన్ జిన్నింగ్ మిల్‌తో పాటు ఓబుల్కేశ్వాపూర్లోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్, జనగామ గ్రామంలోని శివ ఇండస్ట్రీస్, దేవరుప్పుల మండలం బంజారాలోని వినాయక కాటన్ ఇండస్ట్రీస్, ధర్మగడ్డ తండాలోని లక్ష్మీ శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్‌ను గుర్తించారు.
యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి
రైతులు పత్తిని విక్రయించేందుకు కపాస్ కిసాన్ యాప్‌లో తమ ఫోన్ నంబరుతో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏ మిల్లుకు, ఏ సమయంలో పత్తి తీసుకెళ్లాలనే వివరాలు స్లాట్ బుకింగ్ ద్వారా తెలుస్తాయి. దీంతో రైతులు నిర్ణీత సమయంలో మి ల్లుకు చేరుకుని నిరీక్షణ తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా కొనుగోళ్లు చేపట్టనున్నారు. అంతకంటే ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులు వ్యవసాయ శాఖ ఏఈ ఓను సంప్రదించి, వారి లాగిన్ ద్వారా స్లాట్ బుక్ చే సుకోవచ్చు. పత్తి విక్రయానికి వెళ్లేట ప్పుడు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, రైతుభరోసాకు అనుసంధానమైన ఫోన్ నంబర్ తీసుకెళ్లాలి.
మద్దతు ధరకు మించి ప్రైవేటు కొనుగోళ్లు
ఈ సీజన్లో మీడియం స్టేపుల్ పత్తికి క్వింటాలుకు రూ.8,267, లాంగ్ స్టేపుల్ రకానికి రూ.8,667 మద్దతు ధర నిర్ణయించారు. గత సీజన్‌తో పోలిస్తే క్వింటాలుకు రూ.557 పెరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు 7,077 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, క్వింటాలుకు గరిష్టంగా రూ.9,100, కనిష్టంగా రూ.8,000 ధర పలికింది. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ లభిస్తుండటంతో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమయ్యే సమయానికి ఇదే పరిస్థితి కొనసాగుతుందా, ధరలు తగ్గుతాయా అన్నది ఆసక్తికరంగా మా రింది. ఎల్‌నినో ప్రభావంతో దిగుబడిపై అనిశ్చితి, ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లపై భిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కొనుగోళ్లు సజావుగా సాగేందుకు మిల్లుల వద్ద సిబ్బందిని కేటాయించాలని సీసీఐ వరంగల్ బ్రాంచ్ జీఎంను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో 13 కొనుగోలు కేంద్రాలు
6 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
మద్దతు ధరకు విక్రయించేలా ఏర్పాట్లు
ప్రస్తుతం ప్రైవేటులో క్వింటాల్‌కు
గరిష్టంగా రూ.9,100 ధర


