● నేడు పెద్దమడూరులో ప్రత్యేక ఉత్సవాలు
● ఆడపడుచులకు డబుల్ బతుకమ్మ ఆట
దేవరుప్పుల : బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఆచారాలు, నమ్మకాల ఆధారంగా ఈ పండుగను భిన్నంగా జరుపుకుంటారు. అలాంటి అరుదైన, విశిష్టమైన సంప్రదాయానికి ప్రతీక మండలంలోని పెద్దమడూరు గ్రామం. ఈ గ్రామంలో జరిగే ఏడొద్దుల సద్దుల బతుకమ్మ ఉత్సవానికి ప్రత్యేకత ఉంది.
పండుగ నేపథ్యం..
రాష్ట్రంలో తొమ్మిదో రోజైన ఆశ్వయుజ అష్టమి (దుర్గాష్టమి) నాడు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ పెద్దమడూరులో భాద్రపద అమావాస్య (మహాలయ అమావాస్య) నాడు ప్రారంభమయ్యే ఈ వేడుకలు, ఏడో రోజైన ‘వేపకాయల బతుకమ్మ’ నాడే ఇక్కడ సద్దుల బతుకమ్మగా ఆడుతారు.
ఊరికి అరిష్టమని మార్చిన పండుగ
పూర్వం ఈగ్రామంలో సద్దుల బతుకమ్మ రోజున (తొమ్మిదో రోజున) చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న సమయంలో ఏడు జతల ఎడ్లు (ఏడొద్దులు) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడమేగాక మంటలు లేచి నివాసిత గుడిసెలు కాలిపోయాయని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు. ఆ విషాదకర ఘటన జరిగినప్పటి నుంచి గ్రామానికి ఎలాంటి కీ డు జరగకూడదని తొమ్మిది రోజులకు బదులు ఏడుఎద్దుల జ్ఞాపకార్థం సద్దులను జరుపుకుంటున్నారు.
ఈ ప్రత్యేక బతుకమ్మతో ఇక్కడి కోడళ్లు, ఆడబిడ్డలకు కలిసి ఆడే అవకాశం ఉంటుంది. తిరిగి వారి త ల్లి, అత్తగారింట్లో సద్దుల బతుకమ్మ ఆడుతారు. ఇది తమకు మాత్రమే దక్కిన అదృష్టమంటున్నారు.


