రైతన్నకు సిరిబంతి | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు సిరిబంతి

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: సంప్రదాయ పంటలైన వరి, పత్తి, మిరపపంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు బంతిపూల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో కేవలం అరవై రోజుల్లోనే ఆదాయం వస్తుండటంతో జిల్లాలో పలు మండలాల్లో రైతులు బంతిపూల సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, బచ్చన్నపేట, దేవరుప్పుల, జఫర్‌గఢ్‌, చిల్పూరు, లింగాలఘణపురం తదితర మండలాల్లో బంతిసాగు చేస్తున్నారు. తమకున్న వ్యవసాయ భూమిలో వరి, పత్తి తదితర పంటలను సాగుచేస్తూనే అందులో ఎకరం, అర ఎకరంలలో బంతిపూల సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు సాగునీటికి చాలా కష్టంగా ఉంది. రైతులు ఆరుతడి పంటలను సాగుచేయాలని ప్రభుత్వం, అధికారులు చెపుతున్న ప్రస్తుత తరుణంలో బంతిపూల సాగు రైతులకు ఎంతో ప్రయోజనకరం.

ఫుల్‌ డిమాండ్‌

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మకు తంగెడు, గునుగుతో పాటు బంతిపూలు తప్పనిసరి. ప్రతీ ఏడాది ఎంగిలిపూల బతుకమ్మ పండుగ నుంచి సంక్రాంతి పండుగ వరకు బంతిపూలకు డిమాండ్‌ ఉంటుంది. బతుకమ్మ పండుగకు, దీపావళికి, కార్తీక మాసంలో గౌరీ నోములు, లక్ష్మీపూజలు, వ్రతాలు, అయ్యప్ప పూజలు, వివాహాలు పలు శుభకార్యాలకు బంతిపూల అవసరం ఎంతో ఉంటుంది. జిల్లాలో పండించిన బంతిపూలను జనగామ మార్కెట్‌తో పాటు వరంగల్‌, హైదరాబాద్‌, గుడి మల్కాపూర్‌ మార్కెట్లకు తరలిస్తుండగా భారీ డిమాండ్‌ ఉంటుంది.

జూలై, ఆగస్టు నెలల్లో నారు

బతుకమ్మ పండుగ లక్ష్యంగా జూలై, ఆగస్టు నెలల్లో రైతులు బంతి నారు పోస్తారు. పండుగ సీజన్‌లో బంతిపూలు కిలోకు రూ.100 నుంచి రూ.150వరకు ఽధర పలుకుతాయి. రైతులు పత్తిసాగు చేస్తే ఎకరాకు రూ.40వేలు ఖర్చు అయ్యేది. కౌలు, విత్తనాలు, మందులు పోగా చేతికి ఏమి మిగిలేది కాదు. అదే బంతిపంటకు రూ.20వేలు ఖర్చు చేస్తే రెండు నెలల్లోనే కోత మొదలవుతుంది. మూడు రోజులకు ఒకసారి పూలు కోసి అమ్ముకోవచ్చు. రైతులు ఎకరాకు రూ.20వేలు ఖర్చు చేస్తే దాదాపు రూ.50వేల పైగా ఆదాయం వస్తుంది. రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు ఉద్యానవన శాఖ రూ.8వేలు సబ్సిడీ అందిస్తుంది. ప్రస్తుతం అన్ని పంటలకు కోతులు, అడవిపందుల బెడద ఎక్కువగా ఉన్న సమయంలో వన్యప్రాణుల బెడద లేని బంతిసాగువైపు రైతులు మొగ్గుచూపుతున్నారు.

చీడపీడల బెడద తక్కువ..

ఇతర పంటలతో పోలిస్తే చీడపీడల బెడద తక్కువ. పెద్దగా మందులు సైతం అవసరం ఉండదు. ప్రస్తు తం ఉన్న సాగునీటి కొరత పరిస్థితుల్లో బంతిపూల సాగు రైతులకు ఎంతో ప్రయోజనం. రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో పావు, అర ఎకరంలో బంతిపూల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

– నర్మెట మండలంలో ఆరే ప్రవీణ్‌ అనే రైతు 15 ఏళ్లుగా బంతిపూల సాగు చేస్తున్నారు. ప్రతీ ఏడాది ఎకరంన్నరలో బంతిపూల సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. జఫర్‌గడ్‌ మండలం సూరారం గ్రామంలో మైదాసు రాజు 20 గుంటల భూమిలో బంతిసాగు చేస్తున్నారు. బంతినారు కొనుగోలు, మొక్కలు నాటడం, ఎరువులతో మొ త్తం రూ.12వేలు ఖర్చు అయింది. బంతిపూలు బా గా వచ్చాయని, కిలో రూ.80ల వరకు అమ్ముతున్నానని, ఇప్పటికే రూ.20వేలు దిగుబడి వచ్చిందని, మరో రూ.60వేల వరకు దిగుబడి వస్తుందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిల్పూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన మాటూరి రాజశేఖర్‌ ఎకరం భూమిలో బంతిసాగు చేస్తున్నారు. రూ.35వేలు వెచ్చించి ఆరువేల మొక్కలను పెంచారు. బతుకమ్మ మొదటిరోజున రూ.15వేల ఆదాయం వచ్చిందని, సద్దుల బతుకమ్మ, దీపావళి పండుగలకు మరింత డిమాండ్‌ ఉంటుందని, పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్నామ్నాయ పంటగా సాగుకు మొగ్గు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం

వరుస పండుగలతో ఫుల్‌ గిరాకీ

పంట వేసిన అరవై రోజుల్లోనే ఆదాయం

జిల్లాలో 70 ఎకరాల్లో బంతిపూల సాగు

తక్కువ నీటితో బంతిసాగు

ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో తక్కువ నీటితో బంతిపూల సాగు రైతులకు మేలు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందవచ్చు. బంతిపంటకు పెద్దగా చీడపీడల బెడద ఉండదు. జిల్లాలో పలువురు రైతులు తమకున్న భూమిలో ఎకరం, అర ఎకరంలలో బంతిపూల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

–సందీప్‌, ఉద్యానశాఖ అధికారి,

స్టేషన్‌ఘన్‌పూర్‌

ఎకరం భూమిలో సాగు చేశా..

ప్రతీ ఏడాది బంతిపూల సాగు చేస్తున్నాం. మాకు నాలుగు ఎకరాలు భూమి ఉండగా మూడు ఎకరాల్లో వరిసాగు, ఒక ఎకరంలో బంతిసాగు చేస్తున్నాం. బంతిసాగు పెట్టుబడికి ఎకరాకు సీడ్‌కు రూ.20వేలు, సాగు ఖర్చు 10వేలు మొత్తంగా దాదాపు 30వేల ఖర్చు అయింది. బంతిపూల దిగుబడి బాగా వచ్చింది. కిలో రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు.

–బానోతు శ్రీను, విశ్వనాథపురం,

స్టేషన్‌ ఘన్‌పూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement