పక్కా ప్రణాళికతో
జాతీయస్థాయిలో విద్యలో అగ్రస్థానంపై నజర్
కార్యక్రమం ఇలా..
విజయ
లక్ష్యం..
జనగామ: రాష్ట్రంలో విద్యా ప్రమాణాల్లో ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన జిల్లా ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమంగా నిలవాలనే లక్ష్యంతో ‘మిషన్ శిఖరం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రూపొందించిన 48 స్లైడ్ల రిఫరెనన్స్ డెక్ (పవర్ ప్రజెంటేషన్)ప్రకారం, ప్రస్తుతం పీజీఐ–డీ (పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్– డిస్ట్రిక్ట్)– 2.0లో 600 మార్కులకు 383 స్కోరు సాధించి ఉత్తమ్–3 గ్రేడ్‌లో ఉన్న జిల్లా, వచ్చే మూడేళ్లలో 486 ప్లస్ స్కోరుతో ఉత్తమ్–1 స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ రూపొందించింది.
ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక కమాండ్ ఆర్కిటెక్చర్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ మిషన్ చైర్‌గా ప్రతీ నెల సమీక్ష నిర్వహించడంతో పాటు నెలకు రెండుసార్లు ఆకస్మికంగా పాఠశాలలను సందర్శిస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్‌గా, డైట్ అకడమిక్ యాంకర్‌గా వ్యవహరిస్తారు. అదనపు కలెక్టర్ నిధుల సమీకరణ బాధ్యతలు నిర్వహిస్తారు. 11 డొమైన్ ఓనర్లు, 70 సూచికలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా, ప్రతీ శుక్రవారం ‘వార్ రూం–ఎంఐఎస్’ ద్వారా పురోగతిని సమీక్షించనున్నారు. ఇప్పటికే జూలై 20 నుంచి సెప్టెంబర్ 20 వరకు 60 రోజుల ప్రత్యేక బ్లిట్జ్ కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణలోని 27 జిల్లాలు ప్రచేష్ట–1 బ్యాండ్‌లో ఉండగా, జనగామ ఒక్కటే ఉత్తమ్–3 గ్రేడ్‌లో నిలవడం విశేషం. ఇప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆదర్శ జిల్లాగా నిలవాలనే సంకల్పంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ‘మిషన్ శిఖరం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నారు.
పీజీఐ–డీ 2.0లో రాష్ట్రంలో తొలి స్థానం, జాతీయ స్థాయిలో 64వ ర్యాంకు సాధించిన జిల్లా విద్యారంగాన్ని దేశంలోనే నంబర్–1గా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోంది. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, యూడైస్ 100 శాతం నమోదు, గ్రంథాలయాలు, ఐసీటీ సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. జిల్లాలోని 479 ప్రభుత్వ పాఠశాలలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించి కట్టెల పొయ్యిల వినియోగానికి స్వస్తి పలికారు. ఉపాధి హామీ నిధులతో 150 పాఠశాలలకు ప్రహరీ, 31 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. టీ–ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం, 27 గురుకులాల్లో టేబుల్ టెన్నిస్ కోర్టులు, పోటీ పరీక్షలకు ప్రత్యేక అకాడమీ, వి లువైన మ్యాగజైన్లు, 50 పాఠశాలల్లో విద్యా మ్యాప్‌ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీఐలో జరిగిన శిక్షణలో జిల్లా అధికారులు విద్యా విజయాలను ప్రదర్శించారు. జిల్లా బృందంలోని శ్రీనివాస్, గౌసియా, శ్రీకాంత్‌రెడ్డి, నర్సయ్య, భానుప్రకాష్, యాకస్వామి బృందాన్ని ఉన్నత అధికారులు సత్కరించడం విశేషం.
విద్యా ఫలితాల్లో జిల్లా ముఖ్యంగా విద్యార్థుల అభ్యాస ఫలితాల విభాగంలో 188/290 మార్కులతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే స్కూల్ సేఫ్టీ, డిజిటల్ లెర్నింగ్, గవర్నెన్స్ వంటి పరిపాలనా అంశాల్లో లోటుపాట్లు ఉండటంతో మొత్తం స్కోరులో కొంతమేర తగ్గింది. ఈ మూడు విభాగాల్లోనే సుమారు 21 పాయింట్ల లోటు ఉందని అధికారులు గుర్తించారు. వీటిని జిల్లా స్థాయిలోనే సరిదిద్దే అవకాశం ఉండటంతో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో మూడేళ్ల సమగ్ర కార్యాచరణ
383 నుంచి 486 స్కోరుకు రూట్ మ్యాప్
బడి భద్రత, డిజిటల్ విద్య,
పాలనపై ఫోకస్
అంశం ప్రస్తుత పరిస్థితి లక్ష్యం
మొత్తం స్కోరు 383/600 2026–27 నాటికి 426 ప్లస్
2027–28 నాటికి 486 ప్లస్
గ్రేడ్ ఉత్తమ్–3 ఉత్తమ్–2 , ఉత్తమ్–1
రాష్ట్రంలో స్థానం 1వ స్థానం అగ్రస్థానం నిలబెట్టుకోవడం


