జనగామ రూరల్: నిధుల కొరతతో రైతు వేదికల నిర్వహణ భారంగా మారి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల మధ్య వారధిగా రైతుల అభివృద్ధి లక్ష్యంతో నిర్మించిన ఈ భవనాలు నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందిగా మారాయి. ప్రతీ మంగళవారం రైతునేస్తం పేరుతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో వీటి కోసం అధికారులే సొంతంగా డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు కొన్ని ఉపయోగంలోలేక నిర్వహణ భారం పెరిగి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం వచ్చిన గాలివానకు రేకులు లేచిపోయాయి. డోర్లు , కిటికీలు లేక అధ్వానంగా మారిన పట్టించుకొనే వారు లేరు.
పెరుగుతున్న ఖర్చులు
ఒక్కో రైతు వేదిక నిర్వహణకు ప్రతీ నెల సుమారు రూ.9 వేల వరకు ఖర్చు అవుతోంది. ఇందులో విద్యుత్ బిల్లులు, శుభ్రత నిర్వహణ, స్వీపర్ వేత నం, తాగునీటి ఖర్చులు ప్రధానంగా ఉంటాయి. నిధులు అందకపోవడంతో కొన్ని చోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. మరికొన్ని చోట్ల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. ఉన్న రైతు వేదికలల్లో తలుపులు, కిటికీలు, మరమ్మతులు లేక ఇబ్బందికరంగా ఉన్నాయి. మరికొన్ని వాడుకంలో లేక పిచ్చిమొక్కలతో నిండి ఉన్నాయి.
జిల్లాలో 62 క్లస్టర్‌లు
జిల్లాలో మొత్తం 62 రైతువేదికలు ఉన్నాయి. ఒక్కో భవనాన్ని సుమారు రూ.22 లక్షల వ్యయంతో నిర్మించారు. రూ.కోట్లలో ప్రజాధనం వెచ్చించి రైతు వేదికలను నిర్మించారు. ఈ భవనాల్లో రైతు శిక్షణ తరగతులు, వీడియో కాన్ఫరెన్స్‌లు, అవగాహన సదస్సులు, రైతు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే 2021 వరకు రైతువేదికల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యేవి. ఐదేళ్ల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
భారంగా రైతు వేదికల నిర్వహణ
నిధులు లేక ఐదేళ్లుగా వెలవెల
అధ్వానంగా ఉన్న పట్టించుకునేవారే కరువు


