‘స్వచ్ఛ జనగామ’ వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం
ఎస్‌జే
స్కోర్..
జనగామ: గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా, జవాబుదారీతనంతో అమలు చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్‌జే–స్కోర్(స్వచ్ఛ జనగామ స్కోర్) పేరుతో రూపొందించిన ప్రత్యేక మూల్యాంకన విధానం ద్వారా ప్రతీ గ్రామపంచాయతీ(జీపీ) పని తీరును నెలనెలా 100 మార్కుల ప్రాతిపదికన అంచనా వేయనున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి భద్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్య ప్రమాణాలు, నిధుల విని యోగం వంటి అంశాలను శాసీ్త్రయంగా పరిశీలించి గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ఆకస్మిక తనిఖీలు, డిజిటల్ ఆధారాలతో ధ్రువీకరణ, ఉత్తమ పనితీరుకు ప్రోత్సాహం, నిర్లక్ష్యంపై కఠిన చర్యలతో గ్రామాల్లో స్వచ్ఛతను శాశ్వత సంస్కృతిగా మార్చడమే ఈ నూతన విధానం ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ మాత్రమే కాకుండా పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య కార్మికుడు, బిల్ కలెక్టర్ పనితీరును కూడా వేర్వేరు స్కోర్ కార్డుల ద్వారా అంచనా వేయనున్నారు.
ప్రతీ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల మొదటి తేదీ మధ్య మండల శానిటేషన్ టాస్క్‌ఫోర్స్ గ్రామ పంచాయతీలను ముందస్తు సమాచారం లేకుండా తనిఖీ చేస్తుంది. తనిఖీల సమయంలో ఫొటోలు, వీడియోలు, రిజిస్టర్లు, ప్రజల అభిప్రాయాలు, నీటి పరీక్షలు వంటి ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతీ మార్కుకు సంబంధించి ఆధారం ఉండాల్సిందేనని, వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం లేకుండా ఫార్ములా ఆధారిత మూల్యాంకనం అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తనిఖీ బృందంలో ఎంపీడీఓ మెంబర్ కన్వీనర్‌గా, ఎంఎస్‌ఓ, ఎంపీఓ సభ్యులుగా ఉంటారు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చడం, తాగునీటి వనరుల్లో మురుగు కలవడం, మానవ మలాన్ని చేతులతో తొలగించడం, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల బకాయిలు, క్లోరినేషన్‌లో నిర్లక్ష్యం, చనిపోయిన జంతువులను తొలగించకపోవడం, బహిరంగ మలవిసర్జన, దోమల లార్వా అధికంగా ఉండటం వంటి పది తీవ్ర ఉల్లంఘనలను ‘రెడ్ ఫ్లాగ్’గా గుర్తించారు. వీటిలో ఒక్కటి నమోదైనా ఆ గ్రామ పంచాయతీకి ఆ నెలలో నేరుగా డీ గ్రేడ్ ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.
ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు ప్రశంసపత్రాలు, ప్రత్యేక గుర్తింపు, పురస్కారాలు లభించనున్నాయి. వరుసగా తక్కువ గ్రేడ్‌లు వస్తే షోకాజ్ నోటీసులు, శాఖాపరమైన చర్యలు, సేవా నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని 280 గ్రామపంచాయతీల్లో ప్రతీ రోజు ప్రతీ ఇంటి నుంచి సగటున 250 గ్రాముల తడి, పొడి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ వ్యర్థాలను శాసీ్త్రయంగా నిర్వహిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రవేశపెట్టిన ఎస్‌జే–స్కోర్ విధానాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణను వేగవంతం చేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా మార్చాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశుభ్ర గ్రామాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎస్‌జే– స్కోర్ కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
పాలన, నిధుల వినియోగం
దోమల నియంత్రణ, ప్రజారోగ్యం
ఘన వ్యర్థాల
నిర్వహణ
ఓడీఎఫ్ స్థిరత్వం
డ్రెయినేజీలు, ద్రవ వ్యర్థాల నిర్వహణ
తాగునీటి భద్రత
జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణకు మార్కులు..
గ్రామపంచాయతీల పనితీరుకు
నెలనెలా గ్రేడింగ్
ఏడు విభాగాల్లో 100 మార్కులు
రెడ్‌ఫ్లాగ్ వస్తే కఠిన చర్యలు..
ఉత్తమ పంచాయతీలకు ప్రశంసలు, ప్రోత్సాహకాలు
ఏడు విభాగాలు.. 100 మార్కులు
12
10
30
10
18


