జనగామ: నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం నిరసనలో పాల్గొన్న నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఏఎంసీ చైర్మన్ శివరాజ్ యాదవ్‌ను పోలీసులు ఎత్తుకుని తీసుకెళ్లారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్, దేవస్థాన కమిటీ చైర్మన్లు గంగం నరసింహారెడ్డి, ఈదులకంటి వెంకటరెడ్డి, యాదగిరి, భిక్షపతి, మసూద్, వంగల కళ్యాణి, వేమల్ల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ
కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో


