దరఖాస్తులకు అవసరమైన పత్రాలు
జనగామ రూరల్: వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా స్థిరమైన ఆదాయం అందించే పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు జిల్లాలో మల్బ రీ సాగు విస్తరణకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 100 ఎకరాల మల్బరీ సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో అర్హులైన, ఆసక్తి గల రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
దిగుబడి..ఆదాయం
మల్బరీ ఒక బహువార్షిక పంట కావడం దీని ప్రధాన ప్రత్యేకత. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 15 నుంచి 20 సంవత్సరాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఏడాదికి కనీసం 8 నుంచి 10 సార్లు ఆకుల కోత తీసుకునే వీలుండటంతో, నేల స్వభావం, నిర్వహణను బట్టి రైతులు సంవత్సరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.
భారీ సబ్సిడీలు..
మల్బరీ సాగు విస్తరణకు ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా భారీ సబ్సిడీలు అందిస్తున్నాయి. జనరల్ కేటగిరీ రైతులకు మల్బరీ మొక్కల సరఫరా, నాటడానికి సెంట్రల్ సిల్క్ బోర్డు (సీఎస్‌బీ) ద్వారా 50 శాతం సబ్సిడీగా గరిష్టంగా రూ.60,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 25 శాతం వాటాగా రూ.30,000 అంద జేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సీఎస్‌బీ ద్వారా 65 శాతం సబ్సిడీగా గరిష్టంగా రూ.78,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా 25 శాతం వాటాగా రూ.30,000 మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన మల్బరీ రేరింగ్ షెడ్ నిర్మాణానికి కూడా ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తున్నారు. జనరల్ కేటగిరీ రైతులకు సీఎస్‌బీ ద్వారా 50 శాతం సబ్సిడీగా గరిష్టంగా రూ.2,25,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,12,500 అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సీఎస్‌బీ ద్వారా 65 శాతం సబ్సిడీగా గరిష్టంగా రూ.2,92,500, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,12,500 మంజూరు చేయను న్నారు. అదనంగా షూట్ ఫీడింగ్ స్టాండ్స్ నిర్మాణానికి జనరల్ కేట గిరీ రైతులకు రూ.10,890, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.22,140 సబ్సిడీ లభిస్తుంది. అలాగే పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన రూ.75,000 విలు వైన 300 చంద్రికలు, 10 ప్లాస్టిక్ ట్రేలను ఉచితంగా అందజేయనున్నారు.
సబ్సిడీకి దరఖాస్తు చేసుకునే రైతులు రెండు ఫొటోలు, రెండు ఎకరాల భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్‌బుక్ (1–బీ), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులను సమర్పించాలని సూచించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమల అధికారి కె.అంబికా సోని, పట్టుపరిశ్రమల అధికారి నవీన్‌పాల్‌రెడ్డి, ఉద్యాన అధికారులు సందీప్, సంతోషిరాణి, రఘునాథపల్లి తహసీల్దార్ రాజేష్‌రెడ్డి, ఆర్‌ఐ అన్వేష్‌తో కూడిన బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇప్పటికే మల్బరీ సాగు చేస్తున్న రైతుల తోటలను సందర్శించి సాగు విధానం, పనుల పురోగతిని పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు అందించింది.
పంట వేసే రైతులకు భారీ సబ్సిడీలు
ప్రత్యామ్నాయ, స్థిరమైన
ఆదాయంతో లబ్ధి
100 ఎకరాల లక్ష్యంతో
అధికారుల చర్యలు


