సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
● జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షకేంద్రాలు
● హాజరుకానున్న 8,605 మంది విద్యార్థులు
సజావుగా నిర్వహించాలి
ఇంటర్ వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి. పరీక్ష సమయంలో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా అదనపు ఆర్టీసీ బస్సులు నడిపించాలి.
–రిజ్వాన్‌బాషా, కలెక్టర్
ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం..
జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. హాల్‌టికెట్ల జారీ విషయంలో విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తే ఆయా కళాశాలపై ఫిర్యాదు వస్తే కఠిన చర్య తీసుకుంటాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి.
–జితేందర్‌రెడ్డి, డీఐఈఓ
జనగామ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 25 నుంచి మార్చి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి మాస్ కాపింగ్ పాల్పడకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పురపాలక, తపాలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా ఆదేశించారు. జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 16 మంది పర్యవేక్షకులు, అదనపు పర్యవేక్షకులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్‌తో పాటు 300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలకు మొత్తం 8,605 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో ఫస్టియర్ జనరల్‌లో 3,100, ఒకేషనల్‌లో 1,111, సెకండియర్ జనరల్‌లో 3,194, ఒకేషనల్‌లో 1,200 మంది ఉన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేయనున్నారు. కాగా ఈసారి పరీక్ష కేంద్రాల గుర్తింపునకు లొకేషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేట్ కళాశాలలు హాల్‌టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టకుండా వెబ్‌సైట్‌లో నేరుగా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు
ఇంటర్ పరీక్ష ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకోగా కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఓఎంఆర్ షీట్లు, బుక్‌లెట్లు నేరుగా జిల్లా పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రశ్నపత్రాలను ఆయా కేంద్రాలకు తరలించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
సర్వం సిద్ధం
సర్వం సిద్ధం


