ప్రతీ ఎకరాకు నీరు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఎకరాకు నీరు

Feb 23 2026 7:37 AM | Updated on Feb 23 2026 7:37 AM

ప్రతీ

ప్రతీ ఎకరాకు నీరు

ములుగు: రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్‌లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్‌వెల్‌ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్‌వెల్‌ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు.

ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం..

ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు.

జూన్‌ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్‌లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్‌ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్‌, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌, వరంగల్‌ ఎంపీలు బలరాంనాయక్‌, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ములుగు కలెక్టర్‌ దివాకర, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌కేకన్‌, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.

రెండేళ్లలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి

దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు

గోదావరి, కృష్ణా జలాల వాటా,

నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం

విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్‌వెల్‌ పరిశీలన

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్‌రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రతీ ఎకరాకు నీరు 1
1/3

ప్రతీ ఎకరాకు నీరు

ప్రతీ ఎకరాకు నీరు 2
2/3

ప్రతీ ఎకరాకు నీరు

ప్రతీ ఎకరాకు నీరు 3
3/3

ప్రతీ ఎకరాకు నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement