
పింఛన్లు పెంచకుంటే రాజీనామా చెయ్
● సెప్టెంబర్ 9న మహాగర్జన నిర్వహిస్తాం
● మంద కృష్ణమాదిగ
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా దివ్యాంగులకు, చేయూత పింఛన్‌దారులకు పింఛన్లు పెంచాలని, లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ, వీహెచ్‌పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సిరిపురం గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంద కృష్ణమాదిగ మాట్లాడారు.. దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతువులకు రూ.2016 నుంచి రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 9న వికలాంగులు, చేయూత పెన్షన్‌దారుల మహాగర్జన సభతో ప్రభుత్వానికి గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ బోడ సునీల్, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు బిర్రు నగేశ్, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్, ఈగ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.