
గ్రామాల్లో ‘పనుల జాతర’
ఊరూరా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, నిరుపేద కూలీల కుటుంబాలకు జీవనోపాధి పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాఖల సమన్వయంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒకేసారి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘పనుల జాతర–2025’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని 12 మండలాల పరిధి 283 గ్రామాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 278 పనులకు రూ.1.35 కోట్లు కేటాయించారు.
‘ఉపాధి’కి కొత్తరూపం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఉపాధి కల్పనకే కాకుండా శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు దోహదపడనుంది. ఈ మేరకు పనుల జాతర కార్యక్రమం ద్వారా వేలాది మందికి పని కల్పించడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగత, సామూహిక ఆస్తుల కల్పన పనులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకురానున్నారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
‘పనుల జాతర’లో భాగంగా పూర్తయిన పనులు ప్రారంభోత్సవం, చేయాల్సిన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇందులో గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలకు ప్రాధాన్యం కల్పించనున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) ద్వారా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ‘జలనిధి’ పథకం ద్వారా చేపట్టనున్న పనులకు కూడా భూమిపూజ చేస్తారు. అలాగే పశువుల కొట్టాలు, కోళ్లు, గొర్రెల షెడ్లు, ఎరువుల తయారీ కేంద్రాలు తదితర వాటిని నిర్మించనున్నారు.
నిస్వార్థ సేవకులకు సన్మానం
సామూహికంగా చేపట్టే ఈ కార్యక్రమం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధి కూలీలు, దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులను అధికారులు సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు.
జీపీ, అంగన్‌వాడీ భవనాలకు ప్రాధాన్యం
జిల్లాలో 278 పనులకు రూ.1.35కోట్లు కేటాయింపు
సమన్వయంతో పనిచేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా అమలు చేస్తున్న పనుల జాతర కార్యక్రమాన్నిర అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలు పూర్తి చేయాలి. ఆయా గ్రామాల్లో చేపట్టే పనులు ప్రణాళిక ప్రకారం లక్ష్యాలు నిర్ధేశించుకొని పనులు చేపట్టాలి. అంగన్‌వాడీలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి. – రిజ్వాన్ బాషా, కలెక్టర్