సాంకేతిక సమస్య రాకుండా చూడాలి
జనగామ: జిల్లాలో ఈనెల 4న నిర్వహించే 2025–నీట్ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరులో ఎలాంటి సాంకేతిక సమస్య రాకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు బుధవారం డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి పట్టణంలోని గీతానగర్ ఏబీవీ డిగ్రీ కళాశాల, పెంబర్తి ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఐఎస్ రెసిడెన్షియల్ సెంటర్లను తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా తరగతి గదుల్లో బెంచీలు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్స్ తదితర కనీస వసతులు కల్పించాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే ఉదయం 11 గంటల నుంచి లోనికి అనుమతించి మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేస్తామని పేర్కొన్నారు. పరీక్ష సమ యం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు హ్యాండ్ కర్చీఫ్, మొబైల్ ఫోన్లు, వాచ్, బెల్ట్, పెన్, పెన్సిల్, రబ్బర్, శార్పనర్, ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోవద్దని, వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అడ్మిట్ కార్డును వెంట తెచ్చుకునే సమయంలో వాటిపై సరైన వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని సూచించారు. వారి వెంట ఆర్డీఓ గోపీరాం, జీసీడీఓ గౌసియాబేగం, చీఫ్ సూపరింటెండెంట్లు రవీంద్రనాయక్, అనిత తదితరులు ఉన్నారు.
నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, పక్కన డీసీపీ, ఆర్డీఓ, ఇతర అధికారులు


