
బతుకమ్మకుంటలో పారిశుద్ధ్య పనులు
జనగామ: జనగామ బతుకమ్మకుంటలో పారిశుద్ధ్య పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. ‘ఆహ్లాదం కరువు’ శీర్షికన గత నెల 28న సాక్షిలో ప్రచరితమైన కథనానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు స్పందించారు. సాక్షిలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌తో బతుకమ్మకుంట వాకర్స్ అసోసియేషన్, అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు కలెక్టర్‌కు మెమోరాండం అందించగా, పలువురు కుంట ప్రాంతంలో నిరసన తెలిపారు. ఈ మేరకు మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు మసిఉర్ రెహమాన్, అనితతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బతుకమ్మకుంటకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు ఫోన్ చేయగా.. శానిటేషన్ కార్మికులతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. వాకర్స్, కుటుంబ సమేతంగా వచ్చే పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ ఆధ్వర్యంలో కార్మికులు బతుకమ్మకుంటలోని పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్తా, చెదారం, మైదానం శుభ్రం చేశారు. వాకర్స్ నడిచే ట్రాక్‌కు రెండు వైపులా ఏపుగా పెరిగిన మొక్కలను తొలగిస్తున్నారు. అలాగే కుంటలోని వాటర్ నుంచి దుర్వాసన వెదజల్లుతుండగా.. అందులోని నాచు, చెత్తను మాత్రమే తీయించనున్నట్లు అధికారులు చెప్పారు. శానిటేషన్ పనులు ప్రారంభం కావడానికి కృషి చేసిన సాక్షికి వాకర్స్, పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
కుంట అభివృద్ధికి రూ.1.50 కోట్లు
జనగామ ఐకాన్ బతుకమ్మకుంట అభివృద్ధికి రూ.1.50 కోట్లు నిధులను ఖర్చు చేయనున్నారు. 2015 ఎల్‌ఆర్‌ఎస్ నిధులతో పాటు పురపాలికకు సంబంధించి 18 బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయగా వచ్చిన డబ్బులతో కుంట అభివృద్ధికి వెచ్చించనున్నారు. కుంటలోని నీటి చుట్టూ రేలింగ్, కలర్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, తదితర అభివృద్ధి పనులు చేయనున్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నిధులను సమీకరించుకోగా, త్వరలోనే పనుల కోసం టెండర్లను పిలువనున్నట్లు ఏఈ మహిపాల్ మంగళవారం తెలిపారు.
పర్యవేక్షించిన ఎమ్మెల్యే పల్లా

బతుకమ్మకుంటలో పారిశుద్ధ్య పనులు

బతుకమ్మకుంటలో పారిశుద్ధ్య పనులు