– ప్రాణం తీసిన పెట్రోల్ బంకు వివాదం
ధర్మపురి: వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యతలు చూడాల్సిన కొడుకు పెట్రోల్‌బంక్ విషయంలో తండ్రితో గొడవ పడి పెట్రోల్‌బంక్ వద్దే కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటన మండలంలోని నేరెల్ల గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నేరెల్లకు చెందిన మేడిపెల్లి వెంకటేశ్ (55 )కు ఒకగానొక్క కొడుకు లక్ష్మణ్. కొంతకాలంగా తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. లక్ష్మణ్ అమెరికా వెళ్లి రెండేళ్ల క్రితమే గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఇటీవల తండ్రి పేరుమీద పెట్రోలు బంకు మంజూరైంది. బంకును గ్రామ సమీపంలో నిర్మిస్తున్నారు. పనులు పూర్తి దశకు చేరాయి. బంక్‌ను లీజుకు తీసుకుని నడిపించుకుంటానని తండ్రికి అగ్రిమెంట్ రాసిచ్చాడు. తీరా సమయానికి బంక్‌ను తానే నడిపించుకుంటానని తండ్రి మొండికేయడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన కొడుకు పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సై సధాకర్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇళ్లకు సెల్ నంబర్లు అనుసంధానం చేయాలి
రాయికల్: గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల నంబర్లకు మొబైల్ నంబర్లు అనుసంధానం చేయాలని డీపీవో మదన్‌మోహన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, మేట్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జలసిరి పనులు, మ్యాజిక్ సోపిట్స్ నిర్మాణానికి అనువైన ప్రదేశాల గుర్తింపు, ఉపాధి కూలీల హాజరు శాతం వివరాలు, ఇంటి పన్ను వసూళ్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, డీవీవో వకీల్, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎస్సై బెదిరించారని ఎస్పీకి ఫిర్యాదు
మేడిపల్లి: భూ వివాదంలో మేడిపల్లి ఎస్సై తనను బెదిరించి.. బలవంతంగా బైండోవర్ కాగితాలపై సంతకాలు పెట్టించారని, ఆ అవమానం భరించలేక ఆత్మహత్యకు యత్నించానని, తనకు న్యాయం చేయాలని మేడిపల్లి మండలం రాగోజిపేటకు చెందిన బాలసాని జయ(56) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాను ఒంటరి మహిళనని, తన భూమి, ఇల్లును తమ బంధువులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఎస్సై తన ఫిర్యాదు తీసుకోకుండా రౌడీషీట్ ఒపెన్ చేస్తానని బెదిరించారని, తన ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తే శుక్రవారం పోలీసులు ఇంటికి వచ్చి తనను ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను పోలీస్‌స్టేషన్‌లో ఉంచుకున్నారని, పోలీస్ జీపులో ఎక్కించి రెవెన్యూ ఆఫీసులో బైండోవర్ కాగితాలపై బలవంతంగా సంతకాలు పెట్టించారని ఆమె ఆరోపించారు. ఆ వేఽధింపులు భరించలేక చనిపోవాలని ఎలుకల మందు తాగానని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనను వేధించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు.


